ఆసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు…
సిఐ పి దొరరాజు…
నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ అని ఈ కార్డన్ సెర్చ్ ద్వారా అసాంఘిక కార్యక్రమాలను నిర్వహించే వ్యక్తులను, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను గుర్తించవచ్చని సీఐ పి దొరరాజు పేర్కొన్నారు.
మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం నుండి సీఐ పి.దొరరాజు ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్ఐ ల బృందంతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులతో సీఐ మాట్లాడుతూ గ్రామాల్లో యువత గంజాయి, మద్యం,గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు అతి వేగంగా,అజాగ్రత్తగా నడపవద్దని కోరారు. వీటితో కలిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తమ పై వేధింపులను మహిళలు నిర్భయంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. యువత చదువుపై శ్రద్ధ వహించాలని అన్నారు. వాహనాలు నడిపే వారు అన్ని ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండపేట రూరల్ ఎస్సై కిషోర్, అంగర ఎస్సై జి.హరీష్, రాయవరం ఎస్సై డి.సురేష్ బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

