కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ విజయ గణపతి ఆలయం నందు వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిసాయి. శ్రీ విజయ గణపతి స్వామి వారి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం వేములూరు గ్రామంలోని శ్రీ విజయ గణపతి ఆలయం నందు భారీ అన్న సమారాధన నిర్వహించారు. సుమారు మూడు వేల మంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వేములూరు గ్రామంలో గత 42 సంవత్సరముల నుండి శ్రీ విజయ గణపతి వారి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నవరాత్రుల సమయంలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలను అందించడం జరుగుతుందన్నారు. ఐదవ రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని వేములూరు గ్రామంలోని పురవీధుల గుండా మేల తాళాలతో మంగళ వాయిద్యాలతో బ్యాండ్ మేళాలతో గరగ నృత్యాలతో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని అనంతరం స్వామివారి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఆలయం నందు 61 కేజీల లడ్డుకు వేలంపాటలో మేడూరి పిర్ల స్వామి మనవడు సౌరాన్ష్ 17,500 రూ దక్కించుకొనగా, 5 కేజీల లడ్డును పెదపూడి అమ్మిశెట్టి 8100 కు దక్కించుకున్నారు. అనంతరం రాష్ట్ర ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ యానాపు యేసు లను శ్రీ విజయ గణపతి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ విజయ గణపతి ఆలయ కమిటీ సభ్యులు వేములూరు గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు