విజయవాడ హజ్ యాత్ర ఎంబార్కేషన్ పాయింట్‌ను మళ్లీ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాయగా, దానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఫలితంగా విజయవాడను తిరిగి హజ్ ఎంబార్కేషన్ పాయింట్‌గా గుర్తిస్తూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మండపేట టీడీపీ ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై హజ్ యాత్రికులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, రాష్ట్రం నుంచే యాత్ర ప్రారంభించవచ్చని తెలిపారు. ఇది ముస్లింలకు పెద్ద ఊరటగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హజ్ కమిటీ చైర్మన్ హాసన్ బాషా ఈ సేవను మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సల్మాన్ హుస్సేన్, టీడీపీ మండపేట నియోజకవర్గ మైనారిటీ సెల్ నాయకులు ఎండీ అతావుర్ రెహమాన్ (అల్తాఫ్),ఎండీ ఖాదరి (కరీం), ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, కేంద్ర మంత్రిత్వ శాఖలకు కృతజ్ఞతలు తెలియజేశారు.