జగ్గంపేటలో ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం ఘనంగా నిర్వహణ
భారత ప్రభుత్వం చేపట్టిన ‘మై భారత్’ ఉద్యమంలో భాగంగా మణికర్ణిక యువజన సంఘం ఆధ్వర్యంలో, “ఏక్ పేడ్ మా కే నామ్” (ఒక మొక్క – అమ్మ పేరు మీద) కార్యక్రమాన్ని జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తల్లి పేరుతో మొక్కలు నాటే ప్రక్రియ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో వినూత్నంగా ఈ కార్యక్రమం సాగుతోంది. యువత తల్లిపై చూపించే ప్రేమను ఈ మొక్కలపట్ల చూపాలి. భవిష్యత్తు తరాల కోసం పచ్చని పర్యావరణాన్ని అందించాలి అని చెప్పారు. అలాగే మణికర్ణిక యువజన సంఘం చేస్తున్న నిస్వార్థ సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు.సంఘ అధ్యక్షురాలు గున్నాబత్తుల పూజా అనూష మాట్లాడుతూ సృష్టికి మూలం అమ్మే అమ్మ పేరుతో నాటిన మొక్కకు ప్రతిరోజూ నీరు పోసి ప్రాణం పోద్దాం. పర్యావరణ పరిరక్షణకు అమ్మ ప్రేమే మార్గదర్శిగా నిలవాలిఅని చెప్పారు.
కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ చెన్నారావు మాట్లాడుతూ “పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. విద్యార్థులందరూ పర్యావరణ పరిరక్షణకు తగిన పాత్ర పోషించాలి అని సూచించారు.
ఈ సందర్భంగా పర్యావరణ అంశాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు భారత ప్రభుత్వ సర్టిఫికెట్లను, “మేమేంటో” గుర్తింపులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదగా అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఏ.వి.ఎస్. చంద్రశేఖర్, టిడిపి నాయకులు ఎస్.వి.ఎస్. అప్పలరాజు, మారిశెట్టి భద్రం, టీం మణికర్ణిక ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సభ్యులు వీరబాబు, చిక్కాల మణికంఠ, రమేష్, స్వామి, నాని, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.