జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో ఆదికాలం నుంచి గ్రామ దేవతగా పూజలు పొందుతున్న ముత్యాలమ్మ తల్లికి ఈ ఏడాది బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం ఉదయం గ్రామంలోని కన్యలతో కలిసి 108 మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.బోనాల సందర్భంగా మహిళలు కళశాలు నెత్తిపై పెట్టుకుని ఊరంతా ఊరేగింపుగా తిరిగి అమ్మవారి ఆలయం వద్ద బోనాలు సమర్పించారు. గ్రామస్తులంతా భాగస్వామ్యంగా పాల్గొని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పట్టు వస్త్రాలు, పుష్పాల తోరణాలతో ఆలయం అందంగా శోభించగా, మహిళల మంగళ హారతులు, సంప్రదాయ డప్పులు, పల్లకీలు వేడుకకు మరింత ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, “ప్రతి ఏడాది బోనాల పండుగను గ్రామస్థుల సహకారంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి కరుణతో గ్రామంలో సాంత్వన, శాంతి నెలకొంటుందని నమ్మకం” అని తెలిపారు.
ఈ వేడుకకు గ్రామ పెద్దలు, యువత, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి భావంతో కార్యక్రమాన్ని వైభవవంతంగా మార్చారు.