జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల్లో ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో కనీస వసతులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నట్లు వైసీపీ నాయకులు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు నియోజకవర్గ ఇంచార్జ్ తోట నరసింహం ఆదేశాలతో, స్థానిక వైసీపీ నేతలు నాలుగు రోజుల పాటు వసతి గృహాల్లో ‘బాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చినట్లు వారు వెల్లడించారు.
శుక్రవారం కాకినాడలో కలెక్టర్ మరియు డిఆర్ఓ జె. వెంకట్రావులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వసతి గృహాల్లో పారిశుధ్య సమస్యలు తీవ్రమై ఉన్నాయని, విద్యార్థులు నేలపై నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దోమల బాధ తీవ్రంగా ఉన్నదని తెలిపారు. చాలా హాస్టళ్లలో ఇప్పటికీ దుప్పట్లు, దోమతెరలు పంపిణీ చేయలేదని అన్నారు.
వారు ఇంకా పేర్కొన్న అంశాలు:
• మెస్ బిల్లులు, కాస్మొటిక్ చార్జీలు వెంటనే విడుదల చేయాలి
• తక్షణమే మౌలిక వసతులు కల్పించాలి
• శిధిలావస్థలో ఉన్న హాస్టళ్లకు మరమ్మత్తుల నిమిత్తం నిధులు కేటాయించాలి
ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయ్యూరు నానీ, క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుండ్ల జాన్ వెస్లీ, నకిరెడ్డి సుధాకర్, జగ్గంపేట మండల వైసీపీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా, కాపవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.