పాటంశెట్టి సూర్యచంద్ర…. సామాజిక ఉద్యమకారుడు
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులకు సరిపోయే స్థాయిలో జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉందని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఈ కార్మికులకు రూ.6,000 నుండి రూ.10,000 మధ్య జీతాలు మాత్రమే అందుతున్నాయని, ఇవి తగినవి కావని తెలిపారు.తక్కువ జీతాలతో వారు ప్రతిరోజూ అప్పులు చేస్తూ జీవించాల్సి వస్తోందని, ఈ పరిస్థితుల్లో వారిలో అసంతృప్తి నెలకొనడం సహజమని అన్నారు. పారిశుధ్య కార్మికులు సంతోషంగా ఉంటేనే స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతాయని భావిస్తూ వారికి కనీసం రూ.15,000 జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.బూరుగుపూడి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నేతలు, గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. అట్టడుగున ఉన్న నిరుపేద కుటుంబాల అభివృద్ధికి అక్షరాస్యత పెంపు, బాల్యవివాహాల నిర్మూలన, విద్యను ప్రోత్సహించడం, చెడు వ్యసనాలను విడిచి మంచిమార్గంలో నడవాలని ప్రజలను ఆయన కోరారు. కులమతాలతో సంబంధం లేకుండా సమాజంలో ఒక్కటిగా మెలగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్న మందకృష్ణ మాదిగ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, జూలై పదవ తేదీన పాఠశాలల్లో జరిగే తల్లిదండ్రుల సమావేశాల్లో ప్రతి ఒక్క తల్లిదండ్రుడు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.