విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:
శంఖవరం, మే 2, (విశ్వం వాయిస్ న్యూస్) :
శంఖవరం మండలం గొంధికొత్తపల్లి శివారు ఏలేరు ఎడమ కాలువ నీటిలో ఇద్దరు యువకులు తాపీ మేస్త్రి చిత్రాడ అర్జున్ రావు కుమారుడు వినాయకరాజు (24), పేరు నాగరాజు కుమారుడు శ్రీను (37) ఆదివారం మే డే రోజున మరణించారు. వీరి తోటి మరో యువకుడు పోతుల అప్పారావు మరణం నుంచి బయట పడ్డాడు. వీరు ముగ్గురూ కాకినాడ జిల్లా తొండంగి మండలం ఎ.కొత్తపల్లి గ్రామానికి చెందిన వారు. వీరు ముగ్గురూ ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం గొంధికొత్తపల్లి పంచాయితీ పరిధిలోని నల్లగొండమ్మకు ఆదివారం నిర్వహించిన ఉత్సవాలను తిలకించడానికి మోటారు సైకిల్ పై వచ్చారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ అనంతరం ముగ్గురు కలిసి మోటార్సైకిలుపై సొంతూరు ఎ.కొత్తపల్లికి తిరిగి బయలు దేరారు. నల్గొండమ్మ తల్లి గుడి దగ్గర నుంచి గొంధికొత్తపల్లి గ్రామాన్ని తప్పిస్తూ నేరుగా వి.వెంకటాపురం గ్రామానికి పొలాల్లో ఉన్న అడ్డు దారి గుండా వారు వచ్చే క్రమంలో గొంధి కొత్తపల్లి సమీపంలోని రౌతులపూడి మండలం శృంగవరం గ్రామం పరిధిలోనికి వచ్చే ఏలేరు రిజర్వాయర్ ఎడమ కాలువ వంతెన దగ్గర ఆగి కాలువ నీటిలో కాళ్లు, చేతులు కడుక్కోవటానికి పేరూరి శ్రీను మొదటిగా కాలువలోని సిమెంట్ దిమ్మ మీదకు దిగడానికి ప్రయత్నించాడు. ఇంతలో ప్రమాద వశాత్తు కాలు జారి కాలువలో మునిగిపోగా అతన్ని రక్షించడానికి చిత్రాడ వినాయకరాజు దిగగా అతను కూడా ప్రమాదవశాత్తు అదే కాలంలో మునిగి పోయాడు. వారిద్దరిని రక్షించే ఆతృతలో నీటిలోనికి అప్పారావు కూడా దూకాడు. ఇతను కూడా కొట్టుకొని పోతుండగా ఆ పక్కనే చేపలు పట్టుకుంటున్న ఓ వ్యక్తి చూసి అప్పారావును కాపాడాడు. ఇంతలో పేరూరు శ్రీను, చిత్రాడ వినాయకరాజులు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయినట్లుగా అన్నవరం పోలీసులకు సంఘటనా స్థలంలో సమాచారం అందింది. సోమవారం ఉదయం అన్నవరంలోని పోలీసు స్టేషను ఎస్సై. శోభన్ కుమార్ సమక్షంలో ప్రత్తిపాడు అగ్ని మాపక శాఖ సిబ్బంది, గజ ఈతగాళ్లు సహకారంతో సోమవారం ఉదయం కాలువలో వెతికారు. రెండు మృత దేహాలను వెదకి వెలికి తీసారు. మృతుల రక్త బంధువులు సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం తుని ప్రభుత్వ ఆస్పత్రిలో శవ పరీక్షలను నిర్వహించారు. మృత దేహాలను బంధువులకు అప్పగించారు. మృతుల కుటుంబీకులు, గొంధి కొత్తపల్లి వీఆర్వో షేక్ బాబ్జీ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద ఘటన వివరాలను ఎస్సై.శోభన్ కుమార్ సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ఈ ఏలేరు రిజర్వాయర్ ఎడమ కాలువలో ఏడాది అంతా విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకు నీరు సరఫరా అవుతూ ఉండటం, కాలువకు ఎక్కడా పై కప్పు లేకపోవడంతో ఈ కాలువలో ప్రమాద వశాత్తూ గాని, వాంచిత మరణాలు గాని తరచూ అనివార్యంగా జరుగుతూ ఉన్నాయి. కాల క్రమంలో హతుల శవాలకు ఈ కాలువ కేరాఫ్ అడ్రస్ గా మారింది.