విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రపురం:
రామచంద్రపురం పట్టణం (విశ్వం వాయిస్) శ్రీ త్యాగరాజ సంగీత సభ ఆధ్వర్యంలో అన్నమాచార్య సంగీత విభావరిని అత్యంత ఘనంగా నిర్వహించారు.ఆ కోనేటి రాయుని భక్త శిఖామణి అయిన వాగ్గేయకారుడు అన్నమయ్య జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ముచ్చుమిల్లి రోడ్డు షిర్డీసాయి బాబా ఆలయ కళ్యాణ మండపం నందు సోమవారం సాయంత్రం అక్కిరాజు బృందంచే అన్నమాచార్య సంగీత విభావరి నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అద్దంకి వెంకట ప్రభాకర శ్రీరామచంద్ర రావు జ్యోతి ప్రజ్వలన కావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా త్యాగరాయ గాన సభ ట్రస్ట్ కి రామచంద్రరావు లక్ష రూపాయలు వితరణ ప్రకటించారు . అన్నమాచార్య జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ కార్యదర్శి తటవర్తి శ్రీనివాస్ తెలిపారు. మనిషిలో ఉన్న శారీరక, మానసిక రుగ్మతలను సైతం నయం చేసే శక్తి సంగీతానికి ఉందని, అలాగే సంగీతం మనసుకి, మనిషికీ ఉల్లాసాన్నిస్తుందని ఆయన అన్నారు. రాత్రి 8గంటల వరకు తన గానామృతాన్ని ప్రవహింప చేసిన అక్కిరాజు శ్రీనివాస్ శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. అనంతరం గోదావరి కవి డాక్టర్ ర్యాలీ శ్రీనివాసు మాట్లాడుతూ పద కవితా పితామహుడు అన్నమయ్య జనమందరిలో తారాడే పదాలతో వేంకటేశ్వరుని కొలిచే భాగ్యం మానవాళికి కలుగజేసారని అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి ఆరార్థి శ్రీధర్,తటవర్తి రాఘవరాజు శర్మ, బి ఎస్ ఎస్ శాస్త్రి, విల్లూరి కృష్ణానంద మూర్తి, బందకవి శ్రీనివాస రామారావు, కొండేపూడి జోగన్న మాస్టారు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అక్కిరాజు శ్రీనివాసు బృందాన్ని నిర్వాహకులు సత్కరించారు.