విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:
అమరావతి,విశ్వం వాయిస్ః
ఈ ఏడాది తొలకరి పలకరింపు తొందరగానే ఉంటుంది. చైత్ర, వైశాఖాలు అలా దాటగానే.. తొలకరి పలకరింపు ఉండబోతోంది. వాతావరణ శాఖ ఇప్పటికే ఈవిషయాన్ని సూచిస్తోంది. నైరుతీ ఆగమనం ఈ సారి మేలోనే జరగబోతోందట. వాతావరణ పరిస్థితిలు రుతుపవనాల ఆగమనానికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంటోంది. ఇటీవల వచ్చిన అసని తుఫాను ఎఫెక్ట్.. ఈ మధ్యే ఏర్పడిన రుతుపవన మేఘాలు దీనికి సంకేతంగా అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచీ చాలా ప్రాంతాల్లో వేసవి ఎఫెక్ట్ తగ్గిపోతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ఈసారి ఖరీఫ్ సీజన్ ను ముందుగానే ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
భారత వాతావరణ కేంద్రం చల్లని కబురు చెబుతోంది. విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వాతావరణ పరిస్థితిలు ఈ సారి అనుకూలంగా ఉన్నాయంటున్నారు. నైరుతీ రుతుపవనాలు ఈ సారి తొందరగానే దేశంలోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారు. దీని ప్రభావంతో ఎండల తీవ్రత తగ్గుముఖం పడుతుందని అంటున్నారు. ప్రధానంగా హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంపైకి రుతుపవన మేఘాలు పయనిస్తున్నాయి. వీటి ప్రభావంతో సోమవారంకల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇంకా బంగాళాఖాతం నుంచి ఈశాన్య భారతంపైకి బలమైన తేమగాలులు పయనించడంతో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఉత్తర కోస్తా పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం, బిహార్ నుంచి ఛత్తీ్‌సగఢ్, తెలంగాణ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణం నెలకొంది. వచ్చే ఐదు రోజులు కేరళ, లక్షద్వీ్‌పలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది.
కాగా నిన్న మొన్నటి వరకూ ఆంధ్ర, తెలంగాణలో పొడి వాతావరణం ఉంది. కొన్ని చోట్ల క్యుములో నింబస్ మేఘాలతో వర్షాలు కురిసాయి. ఇక మరో వారంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతీ పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తే.. వ్యవసాయానికి తగ్గట్టు వర్షాలు సరిపోతాయంటోంది వాతావరణ శాఖ.వచ్చే ఐదు రోజులు కేరళ, లక్షద్వీ్‌పలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది.