విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం ( విశ్వం వాయిస్ న్యూస్)
మానవ మనుగడలో ముఖ్యమైన మూగజీవాలకు అండగా నిలవాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డాక్టర్ వైయస్సార్ సంచార పశు వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చిందని పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. శుక్రవారం ఆమె మరియు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ లు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాలకు చెందిన పశువైద్యాధికారులతో అంబులెన్సులు కేటాయింపుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీ జిల్లాకు అదేవిధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి తొలిదశలో వచ్చిన ఒక అంబులెన్లు ఎక్కడ అ అత్యవసరమో ఆ దిశగా ప్రాధాన్యత క్రమంలో వినియోగించుకోవాలని ప్రస్తుతం తొలిదశలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున అంబులెన్స్ రావడం జరిగిందని, రెండో దశలో నియోజకవర్గానికి మరో అంబులెన్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలకు చెందిన అధికారులు తొలి దశలో వచ్చిన అంబులెన్సులు ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంచాలో జిల్లాలకు చెందిన ఉన్నతాధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రకారం జిల్లా అధికారులు సూచనలు పరిగణనలోకి తీసుకొని తొలిదశలో వచ్చిన అంబులెన్సులను ఆ ప్రాంతాలలో వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూగజీవాల పట్ల అండగా నిలిచి వైయస్సార్ సంచార పశు వైద్య సేవలు కై అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చిందని, టోల్ ఫ్రీ నెంబర్ 19 62 ద్వారా పశు అనారోగ్య సమాచారం తెలిస్తే వెంటనే రైతుఇంటికి వెళ్లి వైద్య సేవలు అందిస్తారన్నారు. ఈ అంబులెన్స్‌లో పశు వైద్యుడు వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కం అటెండర్ అందుబాటులో ఉంటారన్నారు 104, 108 అంబులెన్సులు తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ మొబైల్ అంబులెన్స్ లు ల్యాబరేటరీ క్లినిక్స్ తో పనిచేస్తాయని అంబులెన్స్ లో ఏర్పాటుచేసిన సౌకర్యాలు ప్రస్తావిస్తూ,వెయ్యి కిలోల బరువున్న మూగ జీవాన్ని తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యం ఉందన్నారు . మొబైల్ అంబులెన్స్ లాబరేటరీ క్లినిక్స్ లో 20 రకాలపేడ సంబంధిత వైద్య పరీక్షలు 15 రకాల రక్త వైద్య పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్ తో కూడిన లాబరేటరీ ఉందన్నారు. ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్న జీవాలు అయినా పెంపుడు జంతువులు పక్షులు సర్జరీలు చేసేందుకు వీలుగా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అన్ని సీజన్లకు అవసరమైన వ్యాక్సిన్లు మందులు అంబులెన్స్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె. మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్లు బ్రహ్మ వీర,విజయ రెడ్డి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.