యథేచ్ఛగా ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు చోద్యం చూస్తున్న అధికారులు.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, గోకవరం:
యదేచ్ఛగా ఆక్రమణలు… చోద్యం చూస్తున్న అధికారులు.
గోకవరంలో ఇటీవలి కొంతకాలంగా యథేచ్ఛగా జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణల పట్ల బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షులు ఇజ్జిన కిరణ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం
గ్రామంలో జరుగుతున్న భూ ఆక్రమణల పై కొన్ని రాజకీయ పార్టీలు,స్వచ్ఛంద సంస్థలు,ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఆఖరికి జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా కూడా చర్యలు మాత్రం శూన్యం.పంచాయితీ కార్యదర్శి తీరు మరీ ఆక్షేపనీయంగా ఉంది.డ్రైనేజీలు శుభ్రం చేయిస్తూ ఫోటోలు దిగటం, ప్రచారయావ తప్ప గ్రామాభివృద్ధికి అవరోధమైన ఆక్రమణలను మాత్రం అడ్డుకోవడం లేదు. గతంలో అనుమతులు లేకుండా భారీ వృక్షాలను నరికి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని,ఊరకాల్వను మట్టితో కప్పెట్టేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని,ముస్లిం బరియల్ గ్రౌండ్ ని ఆనుకుని 20 సెంట్ల స్థలం కబ్జాకు గురిఅయ్యిందని,రెవెన్యూ వారు పట్టాలివ్వని స్థలాలలో సైతం వ్యాపార సముదాయాలు నిర్మాణానికి మీరు ఎలా అప్రూవల్స్ ఇస్తున్నారు అని ఫిర్యాదులు చేసినా పంచాయితీ కార్యదర్శి వివరణ ఇవ్వడం లేదు, చర్యలు తీసుకోవడం లేదు.ఆర్టీఐ ఫిర్యాదులు సైతం గ్రామంలోని రాజకీయనాయకులకు ఉప్పందించడం చూస్తుంటే ఏవిధంగా అధికార దుర్వినియోగం అవుతుందో ప్రజలు గ్రహించాలి.ఇంత నిర్భయంగా ఉన్న కార్యదర్శి వ్యవహారశైలి వెనుక ఎవరైనా పెద్ద స్థాయి వ్యక్తులు ఉన్నారేమో అని సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందిస్తుంటే అధికారుల ఉదాసీనత ప్రభుత్వానికి మచ్చ తెచ్చేవిధంగా ఉందని మాట్లాడుతూ ఇకనైనా అధికారులు స్పందించకపోతే జరుగుతున్న ఉదంతాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అక్రమాలకు పాల్పడుతున్న వారి ఆటలు కట్టిస్తాను అని హెచ్చరించారు.