విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు మండలం:
కేంద్రీయ విశ్వ విద్యాలయాల పీజీ వైద్య ప్రవేశ పరీక్షలో డాక్టర్ “వాసుకి” ఉత్తమ ప్రతిభ
——- జాతీయ స్థాయిలో 472 వ ర్యాంకు సాధన
మామిడికుదురు, విశ్వం వాయిస్:
మామిడికుదురుకు చెందిన డాక్టర్ ధూళిపూడి వెంకట సత్య వాసుకి ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ వైద్య విద్యాలయాలలో పీజీ వైద్య విద్య కు ఎయిమ్స్ నిర్వహించే INICET 2023 లో 472 ర్యాంకు సాధించినట్లు తల్లిదండ్రులు స్థానిక మీడియాకు ఆదివారం చెప్పారు. ఈ నెల 13 రాత్రి విడుదలైన ఆ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఆమె జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. ఇటీవల ఆమె నీట్ పీజీ పరీక్షలో జాతీయ స్థాయిలో 2083వ ర్యాంకు కూడా సాధించింది. విశాఖపట్నం గాయత్రి వైద్య కళాశాలలో ఎమ్.బి.బి.ఎస్. పూర్తి చేసిన ఆమె స్వీయ శిక్షణలోనే ఈ రెండు ర్యాంకులు సాధించడం గమనార్హం. ఇప్పుడు ఆమె వైద్య రంగంలో ఎమ్.డి. జనరల్ మెడిసన్ కోర్సు అభ్యసించనున్నారు. గ్రామీణ స్థాయిలో నాణ్యమైన విద్య, వైద్యం పేదలకు అందుబాటులోకి తీసుకుని రావాలనే తండ్రి, దీప్తి విద్యా సంస్థల వ్యవస్థాపకుడు డి.వి.వి.సత్యనారాయణ లక్ష్యాన్ని అనుక్షణం గుర్తుకుంచుకుని వైద్యం అందజేయాలనే ధ్యేయంతోనే తాను ఇంటర్ నుంచి ప్రణాళికతో అడుగులు వేసానని ఆమె చెప్పుకొచ్చారు. లక్ష్యం మదిలో నిత్యం మెదులుతూ ఉంటే ఎలాంటి కోచింగ్ లేకుండా కూడా సొంతంగా సిద్ధమైతే క్లిష్టమైన ప్రవేశ పరీక్షల్లో కూడా ఉత్తమ ర్యాంకు సాధించివచ్చునని వాసుకి వివరించారు. ఆమె తల్లి భ్రమరాంబ మామిడికుదురు మండలం లూటుకుర్రు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఈ ఉత్తమ ర్యాంకు సాధనతో కోనసీమ కు చెందిన పలువురు ప్రముఖులు, దీప్తి విద్యా సంస్థలకు చెందిన బోధన, బోధనేతర సిబ్బంది ఆమెకు అభినందనలు తెలియజేసారు.