ఏప్రిల్ మే నెలల్లో తునికాకు సేకరిస్తే నేటికీ డబ్బులు ఇవ్వని వైనం
పేమెంట్స్ వెంటనే చెల్లించాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా
ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ పిలుపు
ఏప్రిల్ మే నెలలో తునికాకు సేకరించిన కార్మికులకు నేటికీ డబ్బులు ఇవ్వకపోవడం దుర్మార్గం అని తక్షణమే కష్టపడ్డ కార్మికులకు డబ్బులు చెల్లించాలని చింతూరు ఐటీడీఏ ముందు బుధవారం నాడు జరిగే ధర్నాకు తునికాకు కార్మికులందరూ తరలిరావాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ కోరింది. సోమవారం నాడు చింతూరులో జరిగిన ఆదివాసి గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎర్రని ఎండలో పాము,తేలు అనకుండా తునికాకు కార్మికులు తమ పొట్టకూటి కోసం ఆకు సేకరించి ఇస్తే నేటికీ వారికి డబ్బులు చెల్లించకపోవడం అంటే అన్యాయం కాకపోతే ఏమిటని ప్రశ్నించారు. తునికాకు కార్మికులకు డబ్బులు ఇవ్వకుండా వారిపట్ల ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం దేనికని, మంచి ప్రభుత్వం అంటే కార్మికుల కష్టానికి డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడమా అని ఆయన అన్నారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యంలో ఇస్తే ఆదివాసి గిరిజన సంఘం చూస్తూ ఊరుకోదని అందుకే బుధవారం నాడు చింతూరు ఐటీడీఏ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని కార్మికులందరూ ఐక్యంగా కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాక అర్జున్ దొర, దిలీప్, పూనెం. ప్రదీప్ కుమార్, కారం నాగేష్ మొట్టుం.రాజయ్య, బాబు బొర్రయ్య, ఇర్ప.అజయ్, తదితరులు పాల్గొన్నారు.*

