వ్యాపార కార్యకలాపాలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు
కళ్ళెదుట కనబడుతున్నా కళ్ళు మూసుకుంటున్న యంత్రాంగం
సరఫరాదారులు సిలిండర్ కు అధికంగా వసూలు చేస్తూ, బ్లాక్ లో సరఫరా చేస్తున్నారని విమర్శలు
ప్రమాదంగా మారకముందే మేలుకోవాలని ప్రజల హితవు
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఇబ్బందులను తగ్గించి, వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, దీపం పధకం ద్వారా పేద,మద్య తరగతి ప్రజలు నిత్యం వినియోగించే వంట గ్యాస్ ను సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా అందిస్తూ సహాయ పడుతున్నప్పటికీ, గృహ అవసరాల నిమిత్తం వినియోగించవలిసిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు అందించే సబ్సిడీ వంటగ్యాస్ ను కొంతమంది వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ లో కొనుగోలు చేసి తమ వ్యాపారాలకు వినియోగిస్తున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలం లో రహదారిని అనుకుని ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లు, టీ పాయింట్, బిరియాని సెంటర్లు ముమ్మరంగా నడుపుతుండగా ఏ హోటల్లో, పాయింట్ లలో చూసినా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లే దర్శనమిస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కుతూ, నిర్భయంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వ్యాపారులు వాడుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేడు. కళ్లెదుటే గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా జోరుగా సాగుతున్న పట్టించుకోవాల్సిన సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తూ మామూళ్ల మత్తులో మునిగిపోయారనే విమర్శలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ల గ్యాస్ ధర రూ.1700తో పోల్చి చూస్తే ,
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు రూ. 900 తక్కువ ధరకు వస్తుండడంతోవ్యాపారులు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వైపే మొగ్గుచూపుతూ అదనంగా డొమెస్టిక్ సిలిండర్లను దాచిపెట్టుకుంటున్నారు ఇది ప్రమాదంగా మారవచ్చని పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా డెలివరీ ప్రధాన సరఫరాదారులుగా ఉంటూ ఒక్కో సిలిండర్ కు అవసరాన్ని బట్టి రూ.200 నుంచి రూ.400 ల వరకు అదనంగా తీసుకుని సిలిండర్ ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపార అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు విచ్చలవిడిగా వినియోగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు అటు వైపు కన్నెత్తి చూడక పోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.