పెద్ద ఎత్తున మహిళ భక్తులు పాల్గొన్నారు…
కోరిన కోరికలు తీర్చే తల్లి, అమ్మలు గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మండపేట ఏడిద రోడ్ లో కొలువైవున్న పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద శ్రావణమాసం శుక్రవారం పర్వదినం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారికి మహిళలు చీర,గాజులు పసుపు, కుంకుమ పువ్వులు సమర్పించి పూజలు చేశారు.శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారికి మహిళలు బూరెలు, గారెలు, పులిహోర , పాయసం, స్వీట్లు అప్పాలు వంటి రకరకాల వంటలతో సారి పెట్టారు. ఈ సందర్భంగా ఎవరికి తోచిన విధంగా వారు స్వీట్లు తీసుకువచ్చి అమ్మవారి ఆలయంలో సమర్పించారు పూజల అనంతరం ఈ స్వీట్లు అమ్మవారి ప్రసాదంగా భక్తులకు అందించనున్నట్లు ఆలయ చైర్మన్ వాలిన వీరబాబు తెలిపారు. కొందురు భక్తులు పెద్దమ్మ తల్లి ఆలయ సన్నిధిలో నేలపై రూపాయి కాయిన్ నిలబడితే తాము కోరుకున్న కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో కొందరు భక్తులు కాయిన్ నిలబెట్టి పరీక్షించుకున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ముడుపులు కట్టి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మండపేటకు చెందిన రెడ్డి పద్మ భజన బృందం మరియు అవధూత భజన బృందం సభ్యులు పెద్దమ్మ తల్లి భక్తి గీతాలు ఆలపించారు. మండపేట మండలం అర్తమూరు గ్రామానికి చెందిన కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి (చిన్నఅబ్బు) గతంలో అమ్మవారిని తాను కోరుకున్న కోరిక తీరడంతో ఆలయం వద్ద భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద చైర్మన్ వాలిన వీరబాబు బూరెలు ఎగురవేశారు. బూరెలు ప్రసాదం తీసుకునేందుకు మహిళలు ఎగబడ్డారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మండిపూడి చంద్రశేఖర్, కేతిన శ్రీనివాస్,అడ్డాల సత్తిబాబు, శివరామ్ ఆలయ వాలంటీర్లు భక్తులు పాల్గొన్నారు.