విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అన్నవరం:
అన్నవరం, 20 ఏప్రిల్ 2022, (విశ్వంవాయిస్ న్యూస్)
____________________________
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సారా తయారీ, సరఫరా, వినియోగంపై నిషేధం ఉన్నందున అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పిడి చట్టం కింద కేసులను నమోదు చేస్తామని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం పోలీసు స్టేషను అదనపు ఇన్స్పెక్టర్ అజయ్ బాబు బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఎమ్.రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు పోలీసు స్టేషను పరిధిలోని శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని అక్రమ సారా వ్యాపారులు, తయారీ దారులు, రవాణా దారులను గుర్తించి వారిపై బైండోవర్ కేసులను నమోదు చేస్తాము అన్నారు. సారా వ్యాపారులు ఇప్పటికైనా తమ ప్రవృత్తిని మార్చు కోనట్లయితే వారిపై పిడి యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ అక్రమ సారా వ్యాపారంపై పోలీసు పిడికిలిని బిగిస్తూ నేరస్తుల గురించి గాలిస్తున్న నేపధ్యంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో శంఖవరం శివారు కత్తిపూడి వచ్చే రోడ్డులో శంఖవరం గ్రామం కొత్తెం వారి వీధికి చెందిన మంతెన తాతాజీ (తండ్రి సన్యాసిరావు) అక్రమంగా సారాయి రవాణా చేస్తుండగా అతనిని అదుపులోనికి తీసుకున్నాం అన్నారు. నిందితుని వద్ద నుండి పది లీటర్ల నాటు సారాను, దానిని తరలించేందుకు ఉపయోగిస్తూన్న మోటార్ సైకిలును స్వాధీనం చేసుకుని, సదరు నిందితుడిని అదుపులోనికి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. అంతే గాకుండా నిందితుడిని కాకినాడ ఫోర్త్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తి ముందు బుధవారం హాజరు పరచగా ముద్దాయికి 14 రోజుల పాటు కారాగార వాసాన్ని విధించారని అన్నవరం పోలీసు స్టేషను అదనపు ఇన్స్పెక్టర్ అజయ్ బాబు వెల్లడించారు.