-ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి టి.రాజా డిమాండ్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) జిల్లా బృందం స్థానిక అంబేద్కర్ హాస్టల్ పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి టి.రాజా మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా బాలాజీ చెరువు సెంటర్ లో 1976లో దళిత విద్యార్థులు, పేద విద్యార్థులు చదువుకోవడం కోసం వివిధ విద్యా సంస్థలు దగ్గరగా అంబేద్కర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ హాస్టల్ లో జి.ఎం.సి.బాలయోగి, దున్న జనార్దన్ రావు లాంటి ప్రముఖులు ఎందరో వసతి సౌకర్యం పొంది విద్యనభ్యసించారని తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతం, కోనసీమ ప్రాంతం నుండి వందలాది విద్యార్థులు అంబేద్కర్ హాస్టల్లో ఉంటూ ఇంటర్, డిగ్రీ, పీజీ ఉన్నత విద్యను అభ్యసించేవారన్నారు. అంబేద్కర్ హాస్టల్ ను 2021 ఫిబ్రవరి నెలలో నూతన బిల్డింగ్ నిర్మాణం చేస్తామని ఖాళీ చేయించి భానుగుడి సెంటర్లో అద్దె బిల్డింగ్లో పెట్టడం జరిగింది. నేటికీ సంవత్సరం రెండు నెలలు పూర్తయిన అంబేద్కర్ హాస్టల్లో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. అంబేద్కర్ హాస్టల్లో ప్రతి సంవత్సరం 300 నుండి 400 మంది వరకు విద్యార్థులు హాస్టల్ లో ఉండేవారన్నారు. అంబేద్కర్ హాస్టల్ భానుగుడి సెంటర్ కు తరలించిన తర్వాత ప్రస్తుతం 57 మంది మాత్రమే విద్యార్థులు ఉన్నారన్నారు. అద్దె బిల్డింగ్ సరిపోకపోవడంతో వందలాది మంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టలలో, బయట రూముల్లో ఉంటున్నారు. నూతన హాస్టల్ భవన నిర్మాణం కోసం సాంఘిక సంక్షేమ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు 8 కోట్లు అంచనా వేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ హాస్టల్ నిర్మాణం కోసం నిధులు విడుదల చేయకపోవడం వల్ల నిర్మాణం ప్రారంభం కాలేదన్నారు. అంబేద్కర్ 131 వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించడం, దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెబుతూ అంబేద్కర్ హాస్టల్ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం దారుణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ హాస్టల్ నిర్మాణం కోసం తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, సాంఘిక సంక్షేమ అధికారులు తక్షణం అంబేద్కర్ హాస్టల్ నిర్మాణం కోసం కృషి చేయకపోతే విద్యార్థులను,పూర్వ విద్యార్థులను, ప్రజా సంఘాలను, దళిత సంఘాలను, ఇతర రాజకీయ పార్టీలను కలుపుకుని పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో లో ఎస్.ఎఫ్.ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. వరహాలు, కాకినాడ నగర అధ్యక్షులు శ్రీ మణికంఠ సాయి, నాయకులు మనోజ్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.