విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:
మళ్ళీ వంటనూనెల మంట తప్పదా ?
అమరావతి, విశ్వం వాయిస్ః
గత కొంతకాలంగా వంటగదికి వెళ్లాలంటేనే సామాన్యులకు వణుకు పుడుతోంది. వంటనూనెలు మంట పుట్టిస్తున్నాయి. గతంలో కంటే సగం పైగా ధర పెరిగాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో సన్ ఫ్లవర్ నూనె ధరలు పెరిగిపోవడం వల్ల ఇప్పటికే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్టుగా ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ఎగుమతులపై ఇండోనేషియా తాజాగా నిషేధం విధించింది. దీంతో ధరలు మళ్ళీ ఆకాశాన్నంటడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రం జోక్యం చేసుకోకపోతే ధరల పెరుగుదల భారీగా వుంటుందని నిపుణులు చెబుతున్నారు. పామాయిల్ సరఫరా కూడా తగ్గితే ధరలు ఆకాశాన్నంటుతాయి. ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉన్నాయి. ఇండోనేషియా నిర్ణయం ఒత్తిళ్లను పెంచడమే కాకుండా, సరఫరాపైనా ప్రభావం చూపిస్తుంది అని వంటనూనెల వ్యాపారులు చెబుతున్నారు. ఇండోనేషియా ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కేంద్ర సర్కారు కృషి చేయాలి. స్థానికంగా ధరలు పెరిగిపోవడం, పామాయిల్ కు కొరత అంశాల నేపథ్యంలో ఎగుమతులను నిషేధిస్తూ ఇండోనేషియా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. భారత్ లో వంట నూనెల వినియోగం ఒక నెలకు 18 లక్షల టన్నులు ఉంటే, 6-7 లక్షల టన్నుల పామాయిల్ ఇండోనేషియా నుంచే వస్తోంది. ఇండోనేషియా ఎగుమతులకు అనుమతివ్వకపోతే రాబోయే రోజుల్లో ధరల మంట తప్పేలా లేదు.