విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్): అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యానికి కొలబద్ద పంచాయతీరాజ్ సంస్థలని చెముడులంక సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆలమూరు మండలంలో గల 18 గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో తమ్మన మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధికి, సామాజిక న్యాయ సాధనకు అవసరమైన వార్షిక ప్రణాళికలను ఒక యజ్ఞంలాగ పంచాయతీరాజ్ సంస్థలు రూపొందించి దేశవ్యాప్తంగా అమలులోకి రావడంతో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చక్కటి ప్రణాళికలు రూపొందించినప్పుడే పంచాయతీ రాజ్ వ్యవస్థ పరిపూర్ణమై మరింత పటిష్టవంతం అవుతుందని అన్నారు. వేగవంతమైన అభివృద్ధి, సమగ్రమైన, సమ్మిళిత అభివృద్ధి సాధించడానికి వికేంద్రీకరణ, సూక్ష్మ స్థాయి ప్రణాళికలు కోసం కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయా పంచాయితీల్లో కేక్ ను కట్ చేసి పంచాయతీ సిబ్బందికి స్వీట్స్ పంపిణీ చేశారు .