విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:
శంఖవరం, ఏప్రిల్ 25, (విశ్వం వాయిస్ న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దివ్య వార్షిక కళ్యాణ మహోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించ నున్నారు. దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించి సంఘ జీవనానికి తీవ్ర విఘాతం ఏర్పడిన నేపధ్యంలో వరుసగా రెండేళ్ళ పాటు సత్యదేవుని కల్యాణాన్ని భక్తులు లేకుండా కేవలం ఆలయం సిబ్బంది సమక్షంలో అతి సామాన్యంగా నిర్వహించారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు నెమ్మదించిన నేపధ్యంలో ఈ ఏడాది సత్యదేవుని కల్యాణం భక్తులు, ప్రజల సమక్షంలో జనరంజకంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని శంఖవరం మండలంలోని అన్నవరంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కల్యాణం నిర్వహణా కార్యాచరణ రూపకల్పనపై సమాలోచనల సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. వచ్చే మే నెల 11 నుండి 17 తేదీ వరకు నిర్వహించే శ్రీ వీర వేంకటసత్య నారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాల ఆహ్వాన గోడ పత్రికలను ముఖ్య అతిథి రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖా మంత్రి దాడిశెట్టి రాజా, ప్రత్యేక ఆహ్వానితులు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు.
శ్రీ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవము వీక్షించుటకు విచ్చేసే వి.వి.ఐ.పిల వివరాలను ఒక రోజు ముందుగానే రెవెన్యూ శాఖ దేవస్థానంనకు తెలపాలని, కళ్యాణ వేదిక వద్ద కళ్యాణ వీక్షించుటకు మంత్రులు, శాసన సభ్యులు, వి.వి.ఐ.పిలకు ఏర్పాటు చేసిన గ్యాలరీ లోనికి వారిని మాత్రమే అనుమతించేలా, కొండ దిగువన జరుగు ఊరేగింపు అన్ని రోజుల్లోనూ అధిక సంఖ్యలో భక్తులు ఉత్సవాల్లో పాల్గొనే దృష్ట్యా వారి సౌకర్యం నిమిత్తం భారీ వాహనాలను గ్రామంలోనికి అనుమతించకుండా ఖచ్చితంగా బైపాస్ రోడ్డు మీదుగా మళ్ళించాలని, అవసరం మేరకు రవాణాను మళ్ళించాలని, గ్రామములో ఊరేగింపు సమయంలో వాహనాల క్రమ బద్దీకరణ, బందోబస్తు ఏర్పాటు, ఘాట్ రోడ్డులో దేవస్థానం పైకి వచ్చు వాహనాలను క్రమబద్దీకరించాలని, కళ్యాణోత్సవము సమయములో తూర్పు రాజగోపురం (ఆంధ్రాబ్యాంక్, ఎ.టి.యమ్)
పార్కింగ్ స్థలములో ప్రజల వాహనములను లోపలకి అనుమతించకుండానూ, మంత్రులు, శాసన సభ్యులు, వి.వి.ఐ.పిలు వారి వాహనాలను మాత్రమే అనుమతించాలని, రద్దీ రోజులలో ప్రకాష్ సదన్ పార్కింగులో, సీతారామ సత్రం ఖాళీ స్థలములో మాత్రమే వాహనాల పార్కింగ్ చేసేలా, ఇంకనూ రద్దీ వుంటే సత్యగిరి కొండకు వాహనములు మళ్ళించేలా పోలీసు శాఖ విధులు చేపట్టాలని నిర్ణయించారు. శ్రీ స్వామి వారి చక్రస్నానానికి పంపా రిజర్వాయరులో తగిన మట్టము వరకూ నీటిని నిల్వ ఉంచేలా నీటి పారుదల శాఖాధికారులు బాధ్యత వహించాలని తీర్మానించారు.
విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయుట, విద్యుత్ దీపాలంకరణ తనిఖీ చేసి, ఫిట్ నెస్ సర్టిఫికేట్ ఇచ్చుట, శ్రీ స్వామి వాహనాల ఊరేగింపు రోజుల్లో సదరు వాహనములకు విద్యుత్ తీగలు తగలకుండా తగు భద్రత చర్యలు తీసుకొను విధులకు విద్యుత్ శాఖ భాద్యత వహించాలని, 24 గంటలు కొండ పైన, కొండ దిగువ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, 108 వాహనము 24 గంటలు కొండపైన, ఊరేగింపులో కొండ దిగువున అందుబాటు లో ఉంచే విధులను వైద్య, ఆరోగ్యశాఖ చూసు కోవాలని నిర్ణయించారు. శ్రీ స్వామి వాహనాలు గ్రామంలో ఊరేగించుటకు గాను రోడ్లు భవనాల శాఖ ఫిట్ నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని, వివాహం అయ్యేన్ని రోజులూ అగ్ని మాపక వాహనాన్ని కొండపైన అందుబాటులో ఉండాలని, అధిక సంఖ్యలో విచ్చేయు భక్తులకు రద్దీ అనుసరించి అదనపు బస్సులను ఎ.పి.యస్.ఆర్.టి.సిఏర్పాటు చేయుట చేయాలని, అన్నవరం గ్రామములో బ్రాంది షాపులు అన్నీ సాయంత్ర 6.00 గంటల నుండి ఎక్సైజ్ శాఖ మూసి వేయుంచాలని తీర్మానించారు. కళ్యాణోత్సవము సందర్భముగా అన్నవరం ప్రధాన రోడ్డు, గ్రామ వీధులు పరిశుభ్రముగా వుంచుట, మెయిన్ రోడ్డు విదిగా ప్రతిరోజు శుభ్రపరచాలని, బ్లీచింగు, ముగ్గులు వేయాలని, పాత బస్సు స్టాండు వద్ద షాపులను నియంత్రించి రద్దీ లేకుండా స్థానిక గ్రామ పంచాయితీ
చూడాలని, శ్రీ స్వామి వారి కళ్యాణము రోజున అధిక సంఖ్యలో విచ్చేయు భక్తులను కొండపై నుండి కొండ దిగువకు మరియు కొండ దిగువ నుండి కొండపైకి త్రిప్పుటకు బస్సులను గాని టాటా మేజిక్ వాహనాలను
కత్తిపూడి ఆర్.టి.ఓ బాధ్యత వహించాలని తీర్మానించారు.
వైదిక కార్యక్రమములు నిర్దేశించిన సమయమునకు ప్రారంభించుట దేవస్థానం అన్ని శాఖల ప్రత్యేక సిబ్బందికి, కళాకారులకు అన్నదానం నందు మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాటు, కళ్యాణ వేదిక వద్ద వి.ఐ.పి వారిగా సెక్టార్ ప్లాన్ ఏర్పాటు, భక్తులకు ఉచిత త్రాగునీరు సరఫరా, ముఖ్య అతిధులకు త్రాగు నీరు సరఫరా, వసతి ఏర్పాటు, తలంబ్రాలు వితరణ కౌంటర్లు ఏర్పాటు, యస్.ఐ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు, రవాణా విభాగములో కళ్యాణ సమయము నందు పూర్తి స్థాయిలో ఉచితముగా బస్సులు త్రిప్పుట, అన్ని ఊరేగింపులు సకాలంలో సరి అయిన సమయములకు ప్రారంభించాలని, ఊరేగింపులో సాంస్కృతిక కార్యక్రమమాలను సకాలంలో నిర్వహించాలని, కళ్యాణం ప్రత్యక్ష ప్రచారం చేయు సిబ్బంది, ప్రతికా విలేకర్ల వారికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయుట, వేదిక ముందుకు ప్రతికా విలేకర్ల వారు అడ్డుగా రాకుండగా నియంత్రించుట శ్రీ స్వామి వారి కళ్యాణం రోజుల్లో భక్తులు జరుపు నిత్య కళ్యాణములు, ఆయుష్, చండీ హోమాలను తాత్కాలికంగా నిలిపివేసే బాధ్యతలను దేవస్థానం నిర్వహించాలని సమీక్షలో తీర్మానించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులను సమన్వయ పరిచి ఎవరికీ ఏ ఇబ్బందీ కలగకుండా అన్ని శాఖల అధికారులు కల్యాణ మహోత్సవాల్లో అందుబాటులో ఉండి విధులను నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో పెద్దాపురం ఆర్డీవో రమణ, అడిషనల్ డిఎస్పి ఏ.శ్రీనివాసరావు, ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు, ధర్మకర్త ఐవీ.రోహిత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కొయ్యా మురళీకృష్ణ, దేవస్థానం పాలకవర్గం మాజీ సభ్యులు వాసిరెడ్డి జమీలు, ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు, పిఆర్ఓ. కొండలరావు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.