పరీక్షల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు…
డిఆర్ఓ.. బి.సుబ్బారావు…
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ సిటీ న్యూస్: తూర్పు గోదావరి జిల్లాలో మే 6 వ తేదీ నుంచి మే 24 వతేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియేట్ పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమనవ్యయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు తెలిపారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసారు. సమావేశంలో ఆర్ఐఓ జిజికె నూకరాజు, అడిషనల్ ఎస్పీ సిహెచ్. పాపారావు లతో కలిసి డిఆర్ఓ సుబ్బారావు సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 6 నుంచి మే 24వ తేదీ వరకు ఉదయం 9.00 గంటల నుంచి మ.12.00 గంటల వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లా కలెక్టరు వారి అదేశాలు మేరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణకు నియమించబడిన చీఫ్ సూపరింటెండెంట్ల్లు, డిపార్టుమెంటల్ అధికారుల శిక్షణ కార్యక్రమం లో తెలిపిన అన్ని అంశాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలని ఏమైనా సందేహలుంటే నివృత్తి చేసుకోవాల న్నారు.
జిల్లాలో 33,981మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, ఇందుకు 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజమహేంద్రవరం డివిజన్ లో 32 సెంటర్లు, కొవ్వూరు డివిజన్ లో 17 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 17,654 మంది,రెండవ సంవత్సరం పరీక్షలకు 16,327 మంది విద్యార్థులు హాజరు అవుతారని,మొదటి సంవత్సరం వొకేషనల్ పరీక్షలకు 1,650 మంది,రెండవ సంవత్సరం వొకేషనల్ పరీక్షలకు 1,596 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.ఈ పరీక్షలను సిసి కెమెరాల నిఘా తో పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
పోలీస్ శాఖ ద్వారా పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. 49 పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎక్కడ కూడా జిరాక్స్ కేంద్రాలు తెరవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్లను, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలన్నారు. తపాలా శాఖ సంబంధించి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ను ఆయా పరీక్షా తేదీల్లో నిర్దేశించిన సమయం వరకు తీసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.అన్ని పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్లు, ఫర్నిచర్, తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించి ముందస్తుగా చెక్ లిస్ట్ ఏర్పాటుచేసుకుని ఆ మేరకు ఏర్పాట్లను పకడ్బందీగా పరిశీలించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పరీక్షా కేంద్రాల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి ఆశా, ఏఎన్ఎం లను నియమించడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు,అవసరమైన మందులు 108 ను అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ విద్యార్థులకు సౌకర్యవంతంగా బస్సులను ఏర్పాటు చేయాలన్నారు . పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను పంపిణీకి అవసరమైన వాహనాలను రవాణా శాఖ ద్వారా సమకూర్చాలన్నారు.
సమావేశంలో ఆర్ఐఓ జి జి నూకరాజు, అడిషనల్ ఎస్పీ సిహెచ్ పాపారావు, ఆర్జేడీ ఐ శారద, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.