– కాకినాడ జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ సిటీ న్యూస్: ప్రభుత్వ ప్రాధాన్య నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ఈ నెల 26 నుంచి మే 5 వరకు పది రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నందున, క్షేత్రస్థాయిలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను చేరుకునేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కోర్టుహాల్ నుంచి వర్చువల్గా కలెక్టర్ కృతికా శుక్లా.. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, ఉన్నతాధికారులతో కలిసి ఆర్డీవోలు, మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రాధాన్య నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం పరిధిలో ఇళ్ల నిర్మాణాలు; గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల శాశ్వత భవన నిర్మాణాలపై దృష్టిసారించాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల పనులు చాలా వరకు పూర్తయినందున మిగిలిన వాటి నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇందుకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారులు ఆయా మండలాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించి, పనులను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో తొలుత పెద్ద లేవుట్లపై దృష్టిసారించి.. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.సునీత, హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్, సీపీవో పి.త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.