" సత్తా ఉన్నా ఉపయోగించుకొని ప్రభుత్వం
" 28 ఏళ్ళ నైపుణ్యం నెల రోజులుగా నిర్వీర్యం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:
శంఖవరం, ఏప్రిల్ 29, ( విశ్వం వాయిస్ న్యూస్) ;
బ్రతుకు తెరువుకు ఏ పనీ లేకుంటే ఉజ్జోగం, సజ్జోగం లేదా అంటారు. ప్రభుత్వ ఉద్యోగం ఉండి కూడా చేతిలో చేయడానికి ఏ పనీ లేకుంటే ఏమంటారో మరి. పని లేని చోట ప్రభుత్వ ఉద్యోగంలో నియమించారు. ఉత్తుత్తి ఉద్యోగంలో ఉత్తుత్తి పనితో కాలక్షేపం సరిపోతోంది. విధి నిర్వహణా సత్తా ఆయనలో పుష్కలంగా ఉన్నా ఆయన సేవలను అవసరమైన చోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉయోగించు కోలేక పోతోంది. ఫలితంగా ఆయన 28 ఏళ్ళ వృత్తి నైపుణ్యం నెల రోజులుగా నిర్వీర్యం అయిపోతోంది. రోజూ విధుల్లోకి రాక తప్పదు… చేయడానికి పనీ లేదు. ఈ విచిత్ర పరిస్థితి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండలం కేంద్రం శంఖవరంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మనకు కనిపిస్తుంది.
ఈ ఆస్పత్రిలో ఎక్స్ రే ప్లాంట్ యూనిట్ ఉంది. సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన దీన్ని 20-09-1988 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. దౌర్భాగ్యం ఏమంటే పట్టుమని పది రోజులు కూడా ఈ ప్లాంట్ సక్రమంగా పని చేయలేదు. అది నుంచీ దీనికి అన్నీ అవాంతరాలే. పెట్టుబడులు పెట్టలేక, మరమ్మతులు చేయించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎంతో మంది నేతలు వచ్చారు. వినియోగంలో తెచ్చేందుకు కృషి చేస్తామని కోతలు కోసారు. పని కాలేదు. బాగు చేయించక పోడంలో, రేడియో గ్రాఫర్ ను నియమించక పోవడంలో తగ్గేదే లే … అన్నట్టు ప్రభుత్వమూ మొండి కేసింది. 34 ఏళ్ళుగా ప్లాంట్ వైద్య సేవలకు దూరంగా విశ్రాంతి తీసుకుంటోంది. ఇంతలో పోయిన నెలలోనే శంఖవరం ప్రభుత్వాస్పత్రి ఎక్స్ రే ప్లాంటుకు రేడియో గ్రాఫర్ లేరనే విషయం అంతర్జాలంలో కనిపించడంతో ప్రభుత్వానికి మెలకువ వచ్చేసింది. మార్చి 29 న రేడియో గ్రాఫర్ రామకృష్ణను నియమించింది. ఈ రోజుకు సరిగ్గా నెల రోజులు పూర్తి అయ్యింది. పనికిరాని ప్లాంట్ లో ఈయనకు ఎలాగూ పని లేదని ఈయన్ని ఆస్పత్రి ఫార్మసి విభాగంలో సేవలందించేందుకు కేటాయించారు. అప్పటికే ఇదే విభాగంలో సీనియర్ ఫార్మసిస్ట్ రమణకుమారి, ఓ జూనియర్ తాత్కాలిక సహాయకుడూ ఉండటంతో రామకృష్ణకు ఇందులోనూ పనేమీ లేదు.
అయితే ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉందని, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో క్షయ వ్యాధి నివారణ విభాగంలో సుశిక్షితులు, నిపుణులైన ముగ్గురిలో తానూ ఒక్కడిననీ, అక్కడ ఉన్న ఈ తరహా సిబ్బంది ఇద్దరిలోని ఒకడైన తనను శంఖవరం ప్రభుత్వ ఆస్పత్రికి రేడియో గ్రాఫర్ గా పంపిన ప్రభుత్వం తనను వెనక్కి తీసుకునే ప్రయత్నంలో ఉందని, ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని రామకృష్ణ ” విశ్వం వాయిస్ న్యూస్” కు శుక్రవారం సాయంత్రం 3.46 గంటలకు వివరణ ఇచ్చారు.