శుక్లా ఆదేశాలు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
స్మార్ట్‌సిటీ మిషన్ కింద మంజూరై, చేపట్టిన పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (కేఎస్‌సీసీఎల్) ఛైర్‌పర్సన్ కృతికా శుక్లా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన కేఎస్‌సీసీఎల్ కార్యాలయంలో 33వ డైరెక్టర్ల బోర్డు సమావేశం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సీఈవో, ఎండీ సీహెచ్ నాగనరసింహారావు, స్థానిక నగరపాలక సంస్థ మేయర్, బోర్డు డైరెక్టర్ సుంకర శివ ప్రసన్న తదితరులు హాజరైన ఈ సమావేశంలో స్మార్ట్‌సిటీ మిషన్ ప్రాజెక్టులు, ప్రస్తుత పనుల్లో పురోగతి తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ కింద చేపట్టి ప్రస్తుతం నడుస్తున్న పనుల్లో వేగం పెంచి.. వీలైనంత త్వరగా పూర్తిచేసేలా అధికారులు కృషిచేయాలని సూచించారు. ఈ పనులకు సంబంధించి అవసరం మేరకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. గోదావరి కళాక్షేత్రానికి సంబంధించి 88 శాతం, సైన్స్ సెంటర్‌కు సంబంధించి 80 శాతం మేర పనులు పూర్తయినందున మిగిలియున్న పనులను సత్వరం పూర్తిచేయాలన్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే వేసవి సెలవుల్లో జగన్నాథపురం సర్కిల్, రమణయ్యపేట సర్కిల్ తదితరాల్లో పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. పనుల్లో పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి, నివేదికలు పంపాలని.. కాంట్రాక్టర్ల వారీగా ప్రగతిని పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. స్మార్ట్‌సిటీ మిషన్ కింద రూ. 16 కోట్ల విలువైన రహదారుల అభివృద్ధితో పాటు పిండాల చెరువు అభివృద్ధికి సంబంధించిన పనులను సమావేశంలో ప్రతిపాదించారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరాజు, స్వతంత్ర డైరెక్టర్ జేవీఆర్ మూర్తి, సీఎస్ ఎం.ప్రసన్న కుమార్ తదితరులు ప్రత్యక్షంగా హాజరుకుగా మిగిలినవారు వర్చువల్‌గా హాజరయ్యారు.