విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
మహర్షి భగీరథుని సంకల్ప బలం, పట్టుదల ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. గంగను దివి నుంచి భువికి తెచ్చిన మహనీయుడు భగీరథుడు జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక కలెక్టరేట్ వివేకానందహాల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కలెక్టర్ కృతికా శుక్లా.. నగర మేయర్ సుంకర శివ ప్రసన్నసాగర్, డీఆర్‌వో కె.శ్రీధర్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సగర సంఘ ప్రతినిధులు తదితరులతో కలిసి భగీరథుని చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భూమిపై సకల జీవరాశికి గంగా జలాన్ని అందించిన మహర్షి భగీరథుని దీక్షాదక్షతను సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ దీక్షకు, సహనానికి మహర్షి భగీరథుడు ప్రతిరూపమని.. ఎంత కష్టాన్నయినా లెక్కచేయక అనుకున్నది సాధించినవారిని భగీరథునితో పోల్చుతామని పేర్కొన్నారు. భగీరథుని గురించి నేటి తరం తప్పనిసరిగా తెలుసుకోవాలని.. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఆయన సుగుణాలను అలవరచుకొని సమున్నతంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్‌వీఎస్ సుబ్బలక్ష్మి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి కె.మయూరి, స్థానిక డివిజన్ బీసీ సంక్షేమ అధికారి టీవీ ప్రసాద్, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు నక్కా కిషోర్, సగర కార్పొరేషన్ డైరెక్టర్ జె.అప్పయ్యమ్మ వెంకటేష్, సగర సంఘం ప్రతినిధులు హాజరయ్యారు.