Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఉభయ గోదావరి జిల్లాల అన్నదాత కాటన్ మహాశయుడు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

* 15 న కాటన్ జయంతి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:

 

శంఖవరం, మే 14, (విశ్వం వాయిస్ న్యూస్) ;

మన దేశాన్ని దోచుకెళ్లిన బ్రిటీషోళ్ళని భారతీయులు తిట్టుకుంటూనే అదే దేశానికి చెందిన ఒక్క కాటన్ దొర మహాశయుడికి మటుకు విగ్రహాలెట్టుకుని మరీ పూజిస్తారు ఉమ్మడి గోదావరి జిల్లాల వాసులు. సేవకు దేశానితో సంబంధం లేదని కార్యాచరణ పూర్వకంగా ఆచరించి చూపిన మహనుభావులలో ఈ కాటన్ మహాశయుడు ప్రధముడు. రాజమండ్రిలో కాటన్ బ్యారేజీ నిర్మాణంతో కాటన్ మన ఉభయ గోదావరి జిల్లాల తెలుగు ప్రజల గొంతులు తడిపిన కాటన్ మహాశయుడు నిజంగా ఓ తండ్రి లాంటి వాడు. ఇప్పుడంటే గోదావరోళ్ళు సంవత్సరానికి మూడు పంటలు పండించుకుంటా, ఏ ఏటికాయేడు భూముల ధరలను పెంచుకుంటా, ఇలా ఎటకారాలాడుకుంటా గడిపేస్తున్నారు గానీ సుమారు రెండొందలేళ్ళ ఎనక్కి వెళ్తే మాత్రం ఆ నాటి పరిస్థితులే వేరంటండీ…
ఇప్పుడు ఆంధ్రుల ధాన్యాగారంగా పేరున్న గోదావరి జిల్లాల్లో ఆ 200 ఏళ్ళ క్రితం కరువొస్తే ఆకలి చావులతోను, వర్షాలొస్తే పోటెత్తే వరదలతోనూ అపార ప్రాణ నష్టం మిగులుస్తూ ఆఖరికి పసి పిల్లల్ని కూడా అమ్ముకునే స్థాయిలో కరువు తాండవించేదంట… ఎందుకంటే, ఎక్కడో నాసిక్ లోని త్రయంబకం అనే చోట పుట్టి అందర్నీ పలకరిస్తా, ఎవరెవరి భారాల్నో బాధ్యతగా మోసుకుంటా 1,600 కిమీ పొడవునా ప్రవహించొచ్చిన గోదారమ్మ పాపికొండల మధ్యలో రెండు తాడి చెట్లంత లోతుండే ఉగ్ర గోదావరిగా రూపాంతరం చెంది, అదే వేగంతో అంతర్వేది దగ్గర ఆవేశంగా సముద్రంతో మమేకమయ్యేదట. అంతకు మించి తప్పించి ఏ రకంగానూ ఆ వృధా జలాలు మనకు ఉపయోగ పడేవి కావంట. ఇలాంటి ప్రాంతానికి, విధి నిర్వహణలో భాగంగా ఇంగ్లాండు నుంచి వచ్చి, నరమానవుడు నడవటానికి కూడా ఆలోచించలేని ప్రాంతాల్లో గుర్రమేసుకుని కలతిరుగుతా, ఆనకట్ట కట్టాల్సిన అవసరం గురించి నివేదిక తయారు చేసేయడమే కాకుండా ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఎన్నో అష్టకష్టాలు పడ్డాడంట ఈ పుణ్యాత్ముడు.

“ఒక్క రోజు సముద్రంలో కలుస్తున్న గోదావరి ప్రవాహం, సంవత్సరమంతా మన లండన్లో ప్రవహిస్తున్న థేమ్స్ నదితో సమానం” అని అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంతో పోట్లాడి ఒప్పించిన మహాత్ముడు. ఎన్నో సార్లు ఎన్నో కమీషన్ల ముందు నించుని, పెర్ఫెక్ట్ ఇర్రిగేషన్ ప్లానింగుతో, సరిగ్గా నాలుగేళ్లలో, మూడున్నర కిలోమీటర్ల పొడవుతో, 175 గేట్లతో ధవళేశ్వరం బేరేజ్ అనే అన్నపూర్ణని ఆరోగ్యం పాడు జేసుకుని మరీ నిర్మించి ” నా పేరు జెప్పు కోకుండానే కడుపు నింపుకుని పండగ జేసుకొండోరేయ్” అని అక్షయ పాత్రలా దానమిచ్చేసేడు.. ఈ డీటెయిల్స్ అన్ని ధవళేశ్వరంలో ఉన్న కాటన్ మ్యూజియంకి వెళ్తే చూడొచ్చు.. ఆరోజుల్లో ఆయన ప్లానింగు, వాడిన టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోతాం.. ఇదంతా జరిగి అక్షరాలా నూట అరవై అయిదు సంవత్సరాలు పైనే అవుతోంది. కానీ, ఇప్పటికీ మీరెవరైనా మా గోదారి సైడొస్తే ఈయన గురించి చెప్తూ “కాటన్ దొరగారు” అంటాం తప్పించి “కాటన్” అని ఏకవచనం కూడా వాడమండీ.. బ్రాహ్మణులు రోజూ అర్ఘ్యం వదిలే టప్పుడే కాదు.. గోదావరికి పుష్కరాలొచ్చి నప్పుడు కొంతమందైతే కాటన్ దొరగారికి తర్పణాలు కూడా వొదుల్తారు.. అదీ.. ఆయనగారంటే మావాళ్ళకున్న అభిమానం.. కాటన్ గార్ని తలచుకోగానే కళ్ళముందు మెదిలేది గుర్రం మీద ఠీవిగా కూర్చున్న ఆయన నిండైన విగ్రహం..
అఖండ గోదావరి మాతకి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టి గౌతమి, వశిష్ట అనే రెండు అందమైన కన్య గోదావరులుగా మార్చి తూర్పుగోదావరికొకటి, పశ్చిమగోదావరికోటి ఇచ్చి పెళ్లిళ్లు చేసి, పచ్చని భూములతో పాటు సిరిసంపదల పుట్టుకకు కారణమైనోడు దేవుడు కాక ఇంకేమవుతాడు??
పైగా ఇప్పుడు ఏదైనా పూర్తి చెయ్యడానికి “మీ బాధ్యతంటే మీ బాధ్యతని” దెబ్బలాడుకుంటున్న మనమే ఎన్నుకున్న ప్రభుత్వాలకంటే.. రెండొందల ఏళ్ళ ముందే మనతో ఏం సంబంధం లేకపోయినా వృధాగా పోతున్న గోదావరిని డెల్టాలుగా, తెలుగు రాష్ట్రాలకి ధాన్యాగారాలుగా మార్చి, ఎన్నో కడుపులు నిండటానికి కారణమైన దేవుడిని అపర భగీరధుడు కాదు పరమశివుడితో పోల్చుకోవాలి.అందుకునే తరాలు మారినా కాటన్ మహాశయుని పై ప్రేమాభిమానాలు పిసరంతైనా తగ్గడం లేదు. ఆయన విగ్రహాలు ఎక్కడికక్కడ ఈ తరం వారు నెలకొల్పి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఏటా ఆయన జయంతి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement