విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
గొల్లప్రోలు/కాకినాడ, విశ్వం వాయిస్ః
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం కింద లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఇందుకు లబ్ధిదారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం గొల్లప్రోలు నగర పంచాయతీ లబ్ధిదారులకు కేటాయించిన వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్‌ను కలెక్టర్ కృతికా శుక్లా అధికారులతో కలిసి సందర్శించారు. లేఅవుట్‌లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటికే కొందరు ఇళ్లను నిర్మించుకొని నివాసముంటున్నందున మిగిలిన ఇళ్ల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్.. అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన సదుపాయాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. రూ. 63 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట గొల్లప్రోలు మండల ప్రత్యేక అధికారి కె.సుబ్బారావు, నగర పంచాయతీ కమిషనర్ వి. మహాలక్ష్మీపతిరావు తదితరులు ఉన్నారు.