తోడ్పాటునందిస్తున్నారు
– రైతులకు వైఎస్సార్ రైతు భరోసా మెగా చెక్కు అందజేత
– ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతికా శుక్లా
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
రైతంటే నామోషీ కాదు.. నా మనిషి అనుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నదాత సంక్షేమం లక్ష్యంగా పథకాలు అమలుచేశారని.. ఇప్పుడు ఆయన ఆశయాలకు వారసుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులు అన్ని విధాలా ఎదిగేందుకు తోడ్పాటునందిస్తున్నారని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. సోమవారం వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి అర్హత పొందిన రైతు కుటుంబాలకు తొలి విడత సాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు సత్య కృష్ణ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి కార్యక్రమం నుంచి ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ దవులూరి దొరబాబు, జెడ్‌పీ వైఎస్ ఛైర్‌పర్సన్ బుర్రా అనుబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కంప్యూటర్‌లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసిన అనంతరం ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతికా శుక్లా, శాసనసభ్యులు పెండెం దొరబాబు తదితరులు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా మెగాచెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన రైతు భరోసా కేంద్రాలు రైతుకు అన్ని విధాలా సహాయంగా ఉంటున్నాయని.. ప్రభుత్వం అమలుచేస్తున్నసంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కౌలు రైతులకు కూడా సీసీఆర్‌సీ కార్డులు అందించి, వారికీ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా సాయం అందిస్తోందని తెలిపారు. స్థానిక జిల్లాలో తొలి విడత రైతు భరోసా-పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కింద 1,57,303 మంది రైతు కుటుంబాలకు రూ. 86.79 కోట్ల మేర లబ్ధి చేకూరుతోందని ఎంపీ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి మూడు విడతల్లో ఒక్కో రైతు కుటుంబానికి మొత్తం రూ. 13,500 లబ్ధి చేకూరుతోందని తెలిపారు. జిల్లాలో దాదాపు 30 వేల కౌలు రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా సాయం అందుతుండటం ఆనందకరమని వెల్లడించారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థల ద్వారా పారదర్శకంగా, జవాబుదారీతనంతో అర్హుల ఎంపిక జరుగుతోందని వెల్లడించారు. అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికీ పథకం అందేలా చూస్తున్నట్లు తెలిపారు. సోషల్ ఆడిట్ ప్రక్రియను పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్ పంటను ఒక నెల ముందే అంటే జూన్ 1 నుంచి వేసేలా నీటి విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పంట వర్షాలు, వరదల బారిన పడకుండా చూడటంతోపాటు మూడో పంట కూడా వేసేందుకు ఈ చర్యలు దోహదం చేస్తాయన్నారు. అదే విధంగా వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు క్రమంతప్పకుండా జరిగేలా చూస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. సెప్టెంబర్ నాటికి జిల్లాలో అన్ని రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవనాలు అందుబాటులోకి వచ్చేలా యుద్ధ ప్రాతిపదికన పనుల పూర్తికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ వైఎస్సార్ రైతు భరోసా జిల్లాస్థాయి కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో జరిగినందుకు ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని.. ఈ-క్రాప్ బుకింగ్ ద్వారా రైతు భరోసా, ఉచిత పంటల బీమా తదితర కార్యక్రమాలు అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికీ అందేలా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు రైతులకు అందుతున్నాయన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన విత్తనాలను ఈ నెల చివరినాటికి అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా 40 శాతం రాయితీతో రైతు గ్రూపులకు వ్యవసాయ యంత్రాలను, ట్రాక్టర్లను ప్రభుత్వం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు.
తొలుత జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు పెండెం దొరబాబు.. అనంతరం ఏర్పాటుచేసిన వ్యవసాయ, ఉద్యాన, పట్టు శాఖల స్టాళ్లతో పాటు రైతు భరోసా కేంద్రాల సేవలు, ప్రకృతి సేద్యం తదితరాలకు సంబంధించిన స్టాళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ ప్రధాన అధికారి ఎన్.విజయ్‌కుమార్, ఉద్యాన ప్రధాన అధికారి బీవీ రమణ, ఏపీఎంఐపీ పీడీ ఎస్.రాంమోహన్‌రావు, గొల్లప్రోలు మండల ప్రత్యేక అధికారి కె.సుబ్బారావు, గొల్లప్రోలు నగరపంచాయతీ కమిషనర్ వి.మహాలక్ష్మీపతిరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ ప్రాంతాల రైతులు పాల్గొన్నారు.