విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )
కార్ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సి అనంత ఉదయ భాస్కర్ను వెంటనే అరెస్టు చేయాలని, అతని ఎమ్మెల్సీని రద్దు చేయాలంటూ సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, జై భీమ్ బీఎస్పీ, ఆర్పిఐ, దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం జిజిహెచ్ మార్చురీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు అక్కడే ఉండి పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ ఆందోళన నిర్వహించారు.
అనంతరం మీడియాతో జై భీమ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ హత్య చేసి 24 గంటలు గడుస్తున్న ఇప్పటికీ అనంత బాబును అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. ఈ హత్యను ప్రభుత్వ హత్యగా ఆయన అభివర్ణించారు. వెంటనే పోలీసులు 302గా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గవర్నర్ జోక్యం చేసుకుని అతను ఎమ్మెల్సీను సభ్యత్వం ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ,దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ చట్టాలు అధికార పార్టీకి ఒకలా పేదవారికి ఒకలా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సంఘటన సామాన్యుడు చేస్తే పోలీసులు ఈ విధంగా స్పందిస్తారా అని పేర్కొన్నారు. అనంత బాబు ధైర్యంగా కాకినాడలోనే ఉండి పెళ్లిళ్లకు తిరుగుతున్నా అతన్ని అరెస్టు చేసే సాహసం చేయకపోవడం దుర్మార్గమన్నారు. సంఘటన జరిగి 24 గంటలు గడిచినా కనీసం హోంమంత్రి కూడా నోరు మెదపలేదని ఏ ఒక్క జిల్లాలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే ఆసుపత్రికి రాలేదని దీంతో దళితుల మీద ఉన్న ప్రేమ ఇప్పటికీ అందరికీ అర్థమైందని తెలిపారు
సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ మాట్లాడుతూ అతని కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని ఈ కేసును నీరుగారుస్తున్న పోలీసులపై డిజిపి చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని రాజశేఖర్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుబ్బల ఆదినారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ ఆర్పిఐ రాష్ట్ర కార్యదర్శి పిట్టా వరప్రసాద్, బిఎస్పి దళిత సంఘాల నాయకుడు ఏనుగుపల్లి కృష్ణ, కొండబాబు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జి లోవ రత్నం, ఏఐటియుసి నగర అధ్యక్షులు పప్పు ఆదినారాయణ, వామపక్ష నాయకులు చింతపల్లి అజయ్ కుమార్, ఆర్ నాగేశ్వర రావు, చిట్టి బాబు, శ్రీనులు తదితరులు నాయకత్వం వహించారు.