విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:
శంఖవరం, మే 21, (విశ్వం వాయిస్ న్యూస్) :
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకర్గంలోని మండల కేంద్రం శంఖవరంలో వేంచేసి ఉన్న ఆలయ ఆవరణలో సుందరంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మ వార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి కమనీయంగా కల్యాణాన్ని జరిపించారు. పిఠాపురంలోని కుంతి మాధవ స్వామి దేవస్థానం యాజ్ఞీకులు చక్రవర్తుల వెంకట మాధవ గోపాల కృష్ణమాచార్యుల వైదిక బృందం కల్యాణ వేడుకను నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా తెల్లవారు జామున స్వామి వారికి పంచామృత అభిషేకం, రజిత భరణక అలంకారం, రజిత పుష్పాలతో అష్టోత్తర శతనామావళిని నిర్వహించారు. సాయంత్రం కళ్యాణ మహోత్సవంలో భాగంగా విగ్నేశ్వర పూజ పుణ్యాహవచనం, దీక్షాధారణ ద్వజారోహణ, కన్యాదానం, సుముహూర్తం, తలంబ్రాలు వంటి కార్యక్రమాలను ఆలయ చైర్మన్ పర్వత కృష్ణ కుమారుడు పర్వత అశోక్, రేవతి దంపతులు, అలాగే కత్తిపూడిలోని వేణుమాధవ స్వామి ఆలయ చైర్మన్ కేళంగి నూకరాజు, అమ్మాజీ దంతులు, కేళంగి పేర్రాజు, నాగజ్యోతి దంపతులతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. లోక శాంతి నిమిత్తం స్వామి అమ్మ వారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కల్యాణోత్సవ మంత్రాల అర్థం, పరమార్థాన్ని భక్తులకు తెలియ జేశారు. కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాదాలను, తలంబ్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పర్వత కృష్ణ క్తులతో మాట్లాడుతూ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలను 18 వ తేదీ నుండి 23 వరకు నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మ వార్ల దివ్యాశీస్సులను పొందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఘనంగా గంగాలమ్మ సంబరాలు
_____________________
శంఖవరం మండలం కత్తిపూడిలోని మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల (మెయిన్) సమీపంలో వేంచేసియున్న గంగాలమ్మకు మూడేళ్ళకు ఒక సారి మాత్రమే నిర్వహించుకునే సంబరాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభ మయ్యాయి. భారీ స్థాయిలో మహిళల అమ్మ వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించు కున్నారు. అమ్మ వారి సంబరాల్లో భాగంగా శని, ఆదివారాల్లో భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు.