విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రంపచోడవరం:
ఎటపాక , విశ్వం వాయిస్ న్యూస్ :
వైకాపా నేత రంపచోడవరం నియోజకవర్గ ఇంచార్జి , ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ (బాబు) మాజీ కారు డ్రైవర్ రెడ్డి సుబ్రమణ్యం మృతి చెందిన నేపథ్యంలో ఎమ్మెల్సీపై ప్రతిపక్షాలు చేస్తున్న హత్యా ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంత్రిప్రగడ నరసింహరావు , వైకాపా జిల్లా నాయకులు డేగల రామక్రిష్ణ పేర్కొన్నారు. ఎటపాక మండల కేంద్రంలో వారిరువురు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో అవకాశం దొరికిందని తెలుగుదేశం ఇతర పార్టీల నాయకులు బురద జల్లే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. మరణించిన సుబ్రమణ్యం వైకాపా పార్టీ కుటుంబ సభ్యుడని , తమ కుటుంబ సభ్యుడిని హత్య చేసే దుస్థితి తమ నేతకు లేదన్నారు. డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. అనంతబాబు నాయకత్వంలో సదరు సుబ్రమణ్యం కుటుంబాన్ని ఆదుకుంటామని పేర్కొన్నారు. చిన్నతనంలోనే అనంతబాబు తండ్రిని మావోలు హతమార్చగా కష్టపడి చదువుకుని రాజకీయాల్లో రాణించి తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారని తెలిపారు. ముందు కాంగ్రెస్ పార్టీలో జెడ్పీటిసి , ఎంపిపి , ఎంపిటిసిలను గెలిపించి , తదుపరి వైకాపాలో చేరి ఇద్దరు మహిళలను ఎమ్మెల్యేలుగా నిలబెట్టి గెలిపించుకున్నారని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తి తన దగ్గర డ్రైవర్ గా పని చేసిన వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే తీసుకెళ్లి మృతదేహాన్ని అప్పగిస్తే హత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇటువంటి ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో అనంతబాబును దూరం చేస్తే ప్రతిపక్షాలు పుంజుకుంటాయనే ఊహల్లో ఉన్నారని అటువంటిది ఏది జరగదని అన్నారు. ఈ హత్యా ఆరోపణల్లోంచి కడిగిన ముత్యంలా తమనేత బయటకు వస్తారని ఈ సందర్భంగా వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంత్రిప్రగడ నరసింహరావు , వైకాపా జిల్లా నాయకులు డేగల రామక్రిష్ణ పేర్కొనారు.