– వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ యనమదల.
ఆలమూరు సమావేశంలో మాట్లాడుతున్న యనమదల
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్):
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన చరిత్రాత్మక ఆలోచన, నిర్ణయం మేరకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు జూన్ 1వ తేది నుంచి నీరు ఇవ్వనున్నారని, ఇది డెల్టా ప్రాంత రైతులకు ఓ వరమని ఆలమూరు వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆలమూరు డివిజన్ వ్యవసాయ శాఖ ఎడిఎ సిహెచ్ కెవి చౌదరి ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ఆలమూరు వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద గ్రామ సచివాలయం వ్యవసాయ సహాయకులు, సలహా కమిటీ సభ్యులు, మండపేట, కపిలేశ్వరపురం, ఆలమూరు వ్యవసాయ శాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎడిఎ సిహెచ్ కెవి చౌదరి మాట్లాడుతూ ఆలమూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోగల మూడు మండలాలలో 17వేల 822 హెక్టార్లలో ఆయకట్టు ఖరీఫ్ పంటకు సన్నద్ధం అవుతున్నారని అన్నారు. వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ యనమదల మాట్లాడుతూ నవంబర్‌లో భారీ వర్షాలు కారణంగా రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ఖరీఫ్ పంట ప్రణాళికను 15-20 రోజులు ముందు నుంచి వ్యవసాయ పనులు రైతులు ప్రారంభించాలని తెలిపారు. ఖరీఫ్‌ను ముందే పూర్తిచేయడం వల్ల దాదాపు 20 ఏళ్ల తర్వాత లాభదాయక మూడో పంట వేసే అవకాశం రైతులకు లభిస్తుందని వివరించారు. జూన్ 1న నీటి విడుదలతో ప్రయోజనాలను రైతులకు వివరించాలని, అప్పుడే ఈ చారిత్రక నిర్ణయం ఫలాలు అన్నదాతకు అందుతాయన్నారు. శివారు ప్రాంతాలకు సైతం సజావుగా నీటి సరఫరా జరిగేలా యుద్ధ ప్రాతిపదికన అవరోధాల తొలగింపు పనులను పూర్తిచేయాలని గ్రామ సచివాలయ వ్యవసాయ శాఖ సహాయకులకు ఆదేశించారు. మూడు మండలాల ఏవోలు మాట్లాడుతూ రైతులకు కావాల్సిన వరి
విత్తనాలు రైతు భరోసా వద్ద రైతులకు అందుబాటులో ఉన్నాయని అలాగే వరి విత్తనాలతో పాటు ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. టార్పాలిన్ కావాలని, డ్రైనేజీ సమస్య ఉందని పలువురు రైతులు సభ ముందుకు తీసుకువచ్చారు. రైతు భరోసా కేంద్రం ద్వారా ధాన్యం అమ్ముకోవడం వలన కనీస మద్దతు, గిట్టుబాటు ధర లభిస్తుందని వివరించారు. ఈకార్యక్రమంలో ఆలమూరు, కపిలేశ్వరపురం, మండపేట వ్యవసాయ శాఖ అధికారులు సోమిరెడ్డి లక్ష్మీలావణ్య, కెవిఎన్ రమేష్ కుమార్, బి రవి, వ్యవసాయ మండలి సభ్యులు పాల్గొన్నారు.