విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
అనంత ఉదయభాస్కర్ ను తక్షణం అరెస్టు చేయాలని, ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం స్థానిక ఇంద్ర పాలెం లాగులు వద్ద వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకో వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. డీఎస్పీలు మురళీమోహన్, మురళి కృష్ణ రెడ్డి ల ఆద్వర్యంలో సీఐ రజిని కుమార్, ఎస్ ఐ లు తదితర పోలీసులతో ఆందోళనకారులను అరెస్టు చేయడానికి పూనుకున్నారు. ఆందోళనకారులు పోలీసుల మధ్య పెద్ద తోపులాట జరిగింది. అర్థ గంట రాస్తారోకో చేసి తీరుతామని ఆందోళనకారులు పోలీసులకు చెప్పి, పోలీసుల ఆటంకాలను లెక్కచేయకుండా రాస్తారోకో కొనసాగించారు.
*సుబ్రహ్మణ్యం న్యాయపోరాటం కమిటీ ఏర్పాటు!*
రాస్తారోకో అనంతరం వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు సుందరయ్య భవన్ లో సమావేశం అయ్యి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ సుబ్రహ్మణ్య హత్యకేసులో పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నేరస్తులు అనంత ఉదయ భాస్కర్ ను కేసు నుంచి సాయశక్తులా తప్పించడానికి పోలీసులు ప్రయత్నించారని, ప్రజా సంఘాల పోరాటం ఫలితంగా అనంత ఉదయభాస్కర్ పై కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. కేసు విషయంలో రాజీ పడాలని సుబ్రహ్మణ్యం కుటుంబం పై పోలీసుల ఒత్తిడి పెంచారని విమర్శించారు. ప్రజా పోరాటం ఫలితంగా అనంత ఉదయభాస్కర్ పై కేసు పెట్టిన పోలీసులు ఆయన్ను ఎ వన్ గా పెట్టకుండా ఏ 4 ముద్దాయిగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, అలా చేస్తే చూస్తూ ఊరుకోమని ప్రజాసంఘాల నేతలు హెచ్చరించారు.
అనంతరం వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యం న్యాయపోరాటం కమిటీ ఏర్పాటు జరిగింది అన్నారు. కమిటీకి కన్వీనర్లు గా జే వెంకటేశ్వర్లు, ఏనుగుపల్లి కృష్ణ లను ఎన్నుకున్నారు. వివిధ ప్రజా సంఘాల నుంచి ఒక్కొక్కరిని కో కన్వీనర్ గా తీసుకున్నారు. ప్రతి రాజకీయ పార్టీ, ప్రజా సంఘం నుంచి ఒక్కొక్కర్ని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. రెండు రోజుల్లో ఈ కమిటీ కూర్చుని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానించారు. గవర్నర్ ను కలిసి ఎమ్మెల్సీ పదవి రద్దు కోసం విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో అయితా బత్తుల రామేశ్వరరావు, గుడాల కృష్ణ, టి నూకరాజు, ఏనుగుపల్లి కృష్ణ, జే వెంకటేశ్వర్లు, ఏం రాజశేఖర్, సిహెచ్ అజయ్ కుమార్,పి వీరబాబు, ఆర్ సతీష్, పప్పు దుర్గా రమేష్, బచ్చల కామేష్, మాత సుబ్బు, కాకిలేటి రవీందర్, తాళ్లూరు రాజు, బుంగ సతీష్ కుమార్, వి సి కే బాబ్జి, జే మల్లికార్జున్, పులి ప్రసాద్, సబ్బతి పణీశ్వర రావు, గుత్తుల వెంకటరమణ, చెంగల్ రావు, సిద్ధాంతాల కొండబాబు, తాడి బాబ్జి, భూలోకం, ఎండి షాకీర్, బి ఎస్ ఎన్ మూర్తి, బసవయ్య, దుర్గారావు, రాజేష్, సాధ్య సతీష్, ఖాళీ, అంబటి వెంకట్రావు, జీ దుర్గారావు, ఎన్ విజయ్, లింగం గంగాధర్, భయ్యా రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.