విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:
శంఖవరం, మే 24, (విశ్వం వాయిస్ న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు, యువతులు, బాలికల రక్షణార్ధం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దిశ అనువర్తనంనకు ఖాకీ యూనిఫారం మోకాలడ్డుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దిశ యాప్ ని ప్రత్యేకంగా మహిళల రక్షణ కోసం ప్రవేశ పెట్టిన దగ్గర నుంచి సాధారణ పోలీసులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వున్న 15,005 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 14,000లకు పైచిలుకు వున్న సచివాలయ మహిళా పోలీసులకు ఆ బాధ్యతను అప్పగించారు. సచివాలయ మహిళా పోలీసుల పేరులో పోలీస్ ఉంది తప్పితే.. ఆ పోలీసుల ఒంటిపై ఖాకీ యూనిఫారం లేదు. ఖాకీ యూనిఫారం దుస్తులు వున్న పోలీసులు అంతా ఒక ఎత్తు అయితే ఏ యూనిఫారం దుస్తులూ లేని మహిళా పోలీసులు మరో ఎత్తు అన్నట్టు ఉంది.
క్షేత్ర స్థాయిలో దిశ అనువర్తనాన్ని సచివాలయ మహిళా పోలీసులు, ఇతర సిబ్బందీ ఇనిస్టాల్ చేయిస్తూంటే మిగతా పోలీసు ఉన్నత అధికారులు ఆ మొత్తం ప్రక్రియను మానటరింగ్ చేస్తున్నారు.
సాధారణంగా పోలీస్ యూనిఫారం వేసుకున్న వ్యక్తిని చూస్తే ఎలాంటి వ్యక్తికైనా చిన్న ఆందోళన, భయం, భక్తి, మరికొందరికి చిరాకు కూడా కలుగుతుంది. పోలీసోడు కనపబడితే నాకెందుకు వచ్చిన తలొనొప్పి అనుకొని ఏం చెబితే అది చేసే పరిస్థితికూడా వుంటుంది. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వంలోని పోలీస్ శాఖ కూడా పెద్ద తప్పు చేసింది. గ్రామ స్థాయిలోని సచివాలయ మహిళా పోలీలకు అప్పగించిన దిశ యాప్ ఇనిస్టాల్స్ విషయంలో ఖాకీ యూనిఫారం వేసుకున్న పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అయితే ప్రజల్లో కూడా మార్పు వచ్చేది. కానీ యూనిఫారం లేని మహిళా పోలీసులు వెళ్లి దిశయాప్ పై అవగాహన కార్యక్రమాలు పెడితే వాటిని ప్రజలు అంతగా స్వీకరించడం లేదు. అడపా దడపా అప్పుడప్పుడూ స్పెషల్ డ్రైవ్ పేరుతో చేసే కార్యక్రమాల్లో జిల్లా స్థాయిలో ఎస్పీలు, డివిజన్ స్థాయిలో డిఎస్పీలు, స్టేషన్ పరిధిలో ఎస్ఐలు చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పితే మిగిలిన సమయంలో ఆ బాధ్యత అంతా సచివాలయ మహిళా పోలీసులే చక్కబెడున్నారు. అలాగని నిత్యం పోలీసులకు దిశయాప్ పైనే దృష్టి మొత్తం కేంద్రీకరించాలంటే అది కూడా పూర్తిగా జరగని పని. అలాగని ఖాకీ రోడ్డుపైకి వెళ్లకపోతే సాధారణ ప్రజలు దిశ యాప్ ఇనిస్టాల్ చేయని దుస్థితే ఇప్పటి వరకూ కనిపిస్తూ వచ్చింది. దిశ యాప్ కోసం తెలిసిన వారు సచివాలయ మహిళా పోలీసులు అవగాహన కల్పిస్తే అప్పటికి ఇనిస్టాల్ చేసుకుంటున్నారు. లేదంటే తరువాత చూద్దామని తక్కువగా తీసుకుంటున్నారు.
ప్రస్తుతం యువత ఆండ్రాయిడ్ ఫోన్లలో టిక్ టాక్, షేర్ చాట్, ఇనిస్టా గ్రామ్, ఫేస్ బుక్ వంటి వాటితోనే కాలం గడుపు తున్నారు తప్పితే రక్షణగా ఉండే దిశ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోవడానికి అంతగా ముందుకు రావడం లేదు. ఒక వేళ గ్రామాల్లో సచివాలయ మహిళా పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక దిశ యాప్ ని అప్పటికి ఇనిస్టాల్ చేసుకున్నా.. ఆ తరువాత వెంటనే యాప్ ని డిలీట్ చేసేస్తున్నారు. దిశ ఇనిస్టాల్ చేసుకున్న సంఖ్య పోలీస్ శాఖ డాష్ బోర్డులో కనిపిస్తుంది. కానీ డిలీట్ చేసిన వారి సంఖ్య డాష్ బోర్డులో కనిపించడం లేదు.
ముఖ్యంగా యువతలో దిశ యాప్, దాని వినియోగం పైనా పూర్తి స్థాయిలో అవగాహన లేదు. అలాగని సచివాలయ మహిళా పోలీసులతో నిర్వహించే కార్యక్రమాలు వారి విధుల వరకూ సరిపోతున్నాయి తప్పితే ప్రజల్లోనూ, యువతలోనూ, ముఖ్యంగా విద్యార్ధినిల్లోనూ మార్పు తీసుకు రాలేక పోతున్నాయి. ‘శంఖంలో పోస్తేనే తీర్ధం’ అన్నట్టుగా దిశ యాప్ కోసం ఖాకీ యూనిఫారం వేసుకున్న పోలీసోడు చెబితేనే ప్రజలు వినే పరిస్థితి వచ్చింది. ఖచితంగా విని తీరుతున్నారు అంతే. అలా కాకుండా పేరులో పోలీసు ఉండి ఒంటిపై ఖాకీ యూనిఫారం లేని సచివాలయ మహిళా పోలీసులు దిశ కోసం ఎంత చెప్పినా అక్కడక్కడ కొంత మంది యువత తప్పితే మిగిలిన ఎక్కవ శాతం మంది దిశయాప్ ని ఇనిస్టాల్ చేసుకునే పరిస్థితి కనిపిండం లేదు.
ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను దిశ యాప్ విషయంలో రంగంలోకి దించిన తరువాత నెలకి ఒక సారి చేపట్టే స్పెషల్ డ్రైవ్ లో మాత్రం అత్యధిక సంఖ్యలో యాప్ ఇనిస్టాల్స్ వస్తున్నాయి. తప్పితే వాటి వినియోగం, యాప్ పై అవగాహన మాత్రం ప్రజల్లో రావడం లేదు. అది జరగాలంటే స్టేషన్ పరిధిలోని ఎస్ఐ, సిఐ, డివిజన్ స్థాయిలో డిఎస్పీ, జిల్లా స్థాయిలో ఎస్పీ, రాష్ట్రస్థాయిలో డిజీపీ రంగంలోకి దిగితే తప్పా ఫలితం వచ్చేటట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం పోలీసు శాఖలో ఎస్ఐ నుంచి డీజీపి వరకూ దిశ యాప్ పర్యవేక్షణ, అప్పుడప్పుడూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు తప్పితే..దిశ యాప్ ఇనిస్టాల్స్ చేయించే విషయంలో కొంత మంది రోడ్లపైకి వచ్చినా అధిక శాతం స్టేషన్ స్థాయిలోనే పోలీసు సిబ్బంది రోడ్డు పైకి సీరియస్ గా వచ్చిన ప్రజలకు యాప్ చేరువ చేస్తున్నది తక్కువగా కనిపిస్తున్నది. ఏదో ప్రత్యేక కార్యక్రమాలు పెట్టినపుడు, ఉత్సవాలు ఊరేగింపుల్లో తప్పితే ఇలా పర్యవేక్షణ చేసేకన్నా స్టేషన్ స్థాయిలో ప్రతి రోజూ ఇద్దరు లేదా ముగ్గు కానిస్టేబుళ్లతో మహిళా పోలీసులు కలిసి ప్రజల ముందుకి వెళితే ఖాకీ యూనిఫారం చూసిన భయంతోనో, భక్తితోనో లేదంటే గౌరవంతోనో.. అదీ కాదనుకుండే యాప్ ఇనిస్టాల్ చేసుకోకపోతే ప్రత్యేక తలనొప్పి వస్తుందనే భయంతోనైనా దిశయాప్ ఇనిస్టాల్ చేసుకోవడానికి ముఖ్యంగా యువత ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు ప్రతీరోజూ గుడులు, బడులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మార్కెంటింగ్ చేసే సిబ్బందిలా బాబ్బాబు అంటూ తిరిగి తిరిగి దిశ యాప్ ఇనిస్టాల్ చేయిస్తూ… ఆ సిబ్బంది అటు తిరిగే లోపు ఆ యాప్ ని డిలీట్ చేస్తున్నారు యువత. ఈ వాస్తవ సాంకేతిక కారణాలు, ఇబ్బందులను పర్యవేక్షణ చేసే పోలీసులు గుర్తిస్తున్నట్టు లేదు. అంతే కాదు ఇదే కారణంతో చాలా మందికి యాప్ వినియోగించే అవకాశం, అవసరం కూడా రావడం లేదు.
ముఖ్యంగా ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి దిశ యాప్ ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా వారు మిగిలిన వారికి దాని యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి ఆస్కారం వుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలోని పోలీస్ బాస్ డీజీపి దగ్గర నుంచి స్టేషన్ లోని హోం గార్డు వరకూ యాప్ వారి ఫోన్లలో ఇనిస్టాల్ చేసుకోవాలి. గ్రామ స్థాయిలో సచివాలయ సిబ్బంది, మండల స్థాయిలో మండల అధికారులు, జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు, కళాశాలలు, యూనివర్శిటీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇలా ప్రతీ ఒక్కరూ యాప్ ఇనిస్టాల్ చేసుకునే విధంగా కార్యాచరణను రూపొందించాలి. ముఖ్యంగా ప్రతీ నెలా రాష్ట్ర వ్యాప్తంగా దిశ యాప్ ద్వారా ఎంత మందిని పోలీసులు రక్షించారు. ఎంత మందిని నిందులకు శిక్ష పడిందనే విషయాలు ప్రసార మాద్యమాల ద్వారా తెలియ జేయడం తోపాటు, జిల్లా స్థాయిలోనూ ఆ సమాచారం గ్రామాల వరకూ తెలిసేలా అదే సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాల్సి వుంది. అన్ని రకాల ప్రసార మాద్యమాల ద్వారా దిశ యాప్ వినియోగంపై చతన్య పూరిత కధనాలు, ప్రసారాలు చేయించాలి. ముఖ్యంగా వాహననం నడిపే ప్రతీ ఒక్కరిలోనూ దిశ యాప్ ను ఇనిస్టాల్ చేయించ గలిగితే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరడంతోపాటు దిశ చట్టంగా మారే అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి.