విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్:
నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్ మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. జగన్నాథపురం, రిక్షాలపేట, పప్పుల మిల్లు ఏరియా, ఏటిమొగ, పెద్దమార్కెట్ ప్రాంతాలను సందర్శించి వర్షం కారణంగా నీరు నిలిచిపోయిన ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఎన్‌ఎఫ్‌సీఎల్, దుమ్ములపేట వంటి ప్రాంతాల్లోని ప్రధాన డ్రైనేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ కె.రమేష్ విలేకర్లతో మాట్లాడుతూ వర్షపునీరు నిలిచిన ప్రాంతాల్లో అతికొద్ది సమయంలోనే తమ సిబ్బంది నీటిని తొలగించారని చెప్పారు. అయితే డ్రైనేజీలలో ప్రజలు చెత్త వేస్తుండడం వల్ల మురికినీటి పారుదల నిలిచిపోయి సమస్య తలెత్తుతుందన్నారు. ప్రజలు చెత్తను పారిశుద్ద్య సిబ్బందికి మాత్రమే అందజేయాలని, రోడ్లపైనా, డ్రైనేజీల్లో వేయవద్దని కమిషనర్ కోరారు. అలాగే ప్రజలు యూజర్ చార్జీలను చెల్లించి సహకరించాలన్నారు. స్వచ్ఛసర్వేక్షణ్‌లో మంచి ర్యాంకు సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట ఎం హెచ్ వో డాక్టర్ పృథ్విచరణ్, సిబ్బంది ఉన్నారు.