విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
విశ్వం వాయిస్ న్యూస్
కాకినాడ, జూన్ 9: విజయవాడకు చెందిన నాట (నవరస అకాడమీ ఫర్ టాలెంట్ ఆర్ట్స్ అవార్డ్స్) తెలుగు నంది జాతీయ పురస్కారం-2022నకు కాకినాడకు చెందిన వెల్నెస్ కోచ్ రామ్ కాంచన ఎంపికయ్యారు. ఈయన గత ఆరున్నర కాలం నుంచి పరిసర ప్రాంతాలలో ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం వంటి వాటిపై వివిధ ఆరోగ్య పరిరక్షణ విషయాలను అక్కడి స్థానికులకు వివరిస్తున్నారు. ఆహార నియమాలతోనే సుమారు 80 శాతం వరకు వ్యాధులను దరిచేరనీయకుండా తగ్గించవచ్చని రామ్ కాంచన చెప్తున్నారు.
బిక్కవోలు మండలం కొంకుదురుకు చెందిన ఆయన ఇంతవరకు సుమారు 600 మందికి వివిధ ఆరోగ్య పరిరక్షణ పైన ఆహార నియమ, నిబంధనలపై బోధనలు చేశారు. అందులో భాగంగా సుమారు 50 మంది ఆరోగ్య కార్యకర్తలను నియమించి ఆయా గ్రామాలలో ప్రజలకు ఆరోగ్య నియమాలు వివరించే శిక్షకులుగా తయారు చేశారు. ప్రజల్లో వివిధ కారణాల రీత్యా బిపి, సుగర్, మానసిక ఒత్తిడి, కొవ్వు కరిగించే కారణాలు, గుండె వ్యాధులు, స్థూలకాయం వంటి వాటి నుంచి ఎలా బయటపడాలనే ఆరోగ్యం విషయాలను రామ్ కాంచన వివరిస్తున్నారు. నాట సంస్థ రామ్ కాంచన చేస్తున్న ఆరోగ్య కృషిని గుర్తించి ఈనెల 12వ తేదీన విజయవాడలోని అక్కినేని నాగేశ్వర రావు కళాక్షేత్రంలో ప్రతిభా పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా అవార్డు అందుకోనున్న రామ్ కాంచనకు పలువురు అభినందనలు తెలిపారు.