విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ విశ్వం వాయిస్ః
దినచర్యలో మార్పుల కారణంగా కుటుంబ సభ్యులంతా సంతోషం, ఆనందం పొందడం వలన ఆరోగ్యంగా జీవిస్తారని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో కుటుంబ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతియేటా జూన్ రెండవ శనివారం కుటుంబ ఆరోగ్యం, ఫిట్నెస్ పై అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవం జరుపుకుంటునామని అన్నారు. కుటుంబ సభ్యులంతా దినచర్యలో ఎప్పుడు ఒకే విధంగా మసలడం వల్ల మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే అవకాశం ఉందన్నారు. అందుచే మధ్య మధ్యలో పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని అన్నారు. అదేవిధంగా పార్కులు సందర్శించడం వలన శారీరక వ్యాయామంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఇనుమడిస్తుందని అన్నారు. పార్కులో అందరితో కలసి మెలసి ఉండటం వల్ల కొత్తగా స్నేహితులు ఏర్పడి పలు విషయాలు చర్చించడం వల్ల మానసిక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. పరిశుభ్రమైన గాలి, నీరు, పరిశుభ్రమైన ఆహారం తో పాటు సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు. అదేవిధంగా పెందరాడే నిద్రపోవడం ఉదయాన్ని త్వరగా లేవడం వలన మానసిక ఉత్సాహం కలుగుతుందని డాక్టర్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.