విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఐ పోలవరం:
ఐ.పోలవరం-విశ్వం వాయిస్ న్యూస్:
ఇటీవల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన నేపథ్యంలో రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించి వరి సాగును పండించే విషయంలో రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో పంటలు పండించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి, ఐ పోలవరం మండలం సర్పంచులు సమైక్య అధ్యక్షులు, ఐ పోలవరం గ్రామ సర్పంచ్ దంతులూరి రాఘవరాజు తెలిపారు. కోనసీమలో పలు మండలాల్లో కొంతమంది రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి అయోమయానికి గురి చేస్తున్నారని, రైతులకు అన్ని రకాలుగా ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవడంతో రైతులు ఉత్సాహంగా నారు వేసుకోవడానికి వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా విత్తనాలు, డ్రైనేజ్, ఇరిగేషన్, సమస్యలు లేకుండా చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఐ.పోలవరం మండలం లో రైతులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేసి పంటలు వేసుకునేలా రైతుల్లో చైతన్యం తీసుకొస్తున్నామని, పార్టీలకు అతీతంగా రైతులందరికీ లబ్ధి చేకూరే విధంగా కృషి చేస్తానని అవసరమైతే ఈ సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రైతాంగానికి మేలు చేకూరే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తానని ఆయన తెలిపారు.
రైతులలో ఉన్న సందిగ్దతను, వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడానికి శనివారం ఐ.పోలవరం జడ్పీ హైస్కూల్ ఆవరణలో రైతులకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.