* ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తున్న పులి ఆదృశ్యం
* పులితో ప్రజా ప్రాణహానికి జవాబుదారీ ఎవరు ?
* పులి దాడుల పట్ల వెళ్లడకాని ప్రభుత్వ వైఖరి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:
శరభవరం, జూన్ 16, (విశ్వం వాయిస్ న్యూస్) ;
శరభవరంలో గురువారం సాయంత్రం రెడు మూగ జీవాలను భక్షించే ప్రయత్నం చేసిన పులి ఆ అనంతరం ఆచూకీ లేకుండా పోయింది. ఎటు వెళ్ళి ఉంటుందన్న ఊహకు అందేలా పులి అడుగు జాడలు సైతం ఆ సంఘటనా ప్రాంతం తర్వాత నుంచి కనిపించడం లేదు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం మండలాల్లోని ఏదో ఒక ప్రాంతంలో నిత్యం ఏదో ఒక ఘటనతో ప్రజల నోళ్ళలో నానిన పులి ఉదంతంపై గురువారంతో చెప్పుకోడానికి ఏం లేకుండా పోయింది. మరో పక్క ఇటు అటవీ, అటు పోలీసు శాఖాధికారులకు శ్రమాధిక్యం తగ్గింది. పులి ఆచూకీ కనిపించక పోడమే ఇప్పుడు అసలు సిసలు ప్రధాన సమస్య అయ్యింది. పులి ఫలానా ప్రాంతంలో ఉందన్న జాడ తెలిస్తే…. ఆ ప్రాంతం మినహా మిగతా గ్రామాలన్నీ రోజు వారీ సాయంత్రాలతో సద్దుమణిగి ఒకింత ఆదమరచి నిదురించేవి. మన ఊరికి ఈ పులి రాజా రాదు అనే ఓ ఖచ్చితమైన హామీ ఏదీ లేకపోయినప్పటికీ ఒక వేళ వస్తే… మరింత జాగ్రత్త పడదాంలే అనే ఒకింత ధైర్యం ఉండేది. ఇప్పుడా ధైర్యం కూడా లేదు. ఐతే ప్రస్తుతం ఆచూకీ తెలియడానికి భిన్నంగా పరిస్థితి నిగూఢంగా ఉండటంతో నివురు గప్పిన నిప్పులా ఉన్న పులి ఎప్పుడు … ఎక్కడ… ఎవరిపై … ఏవిధంగా విరుచుకు పడతుందోననే ఆందోళన ఈ మెట్ట మైదాన ప్రాంత వాసుల్లో నెలకొని ఉంది.
దారి తప్పిన పులిపై ప్రభుత్వ వైఖరి ఏంటీ … ?
_____________________________
ఒకవేళ నిజంగా పులి తన స్థానిక ప్రాంత రిజర్వుడు అటవీ భూభాగంలోకి వెళ్ళి పోయిందా…? లేదా… అనే నిజ నిర్ధారణా ప్రకటన ఏదీ కూడా ఇప్పటికింకా మన ప్రభుత్వ యంత్రాంగం నుంచి వెలువడలేదు. స్థానిక అటవీ, పోలీసు అధికారులు వారికి తోచిందేదో చేస్తున్నారు తప్ప నిజానికి పులి పట్ల రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగాల వైఖరి ఏంటనేది ఇప్పటికి ఏదీ బహిర్గతం కాలేదు. పులి బారి నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం ఏ ముందస్తు రక్షణ చర్యలను ఈ ఘనత వహించిన ప్రభుత్వం తీసుకుంటోంది… ప్రజలకు ఏ భరోనిస్తోందీ… ఒక వేళ ఈ వ్యాఘ్రం వల్ల ప్రజలకు ప్రాణహాని జరిగితే దానికి ప్రభుత్వం ఏ తరహా భాధ్యతను వహిస్తుంది… దీనిని కూడా ప్రకృతి వైపరీత్యం / అసహజ మరణంగా భావించి ఏ రకమైన నష్ట పరిహారం ఇస్తుంది… అసలు ఇంతకీ ఈ బెబ్బులి ఏ అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి జనావాసాల మీద పడుతోంది అనే ప్రజల సంశయాల్లో ఏ ఒక్క దానికీ ప్రభుత్వం నుంచి ఏ స్పష్టమైన సమాధానం, అవలంభించే విధానం వెల్లడి కాకపోడం ఏ ప్రభుత్వాన్నైతే తమ ధన, మాన, ప్రాణ రక్షణ కోసం ప్రజలు ఎన్నుకున్నారో అదే ప్రభుత్వం నుంచి అదే ప్రజలకు ఊరటనిచ్చే ఆశాజనకమైన అంశం ఏదీ వెల్లడి కాకపోడం ఓ విచిత్రపరిస్థితిని తలపిస్తోంది.
ఇది అరుదైన రాయల్ బెంగార్ టైగర్ …!
___________________________
రాయల్ బెంగాల్ టైగర్ లేదా బెంగాల్ టైగర్ అనే ఈ పులి పాంథెర టైగ్రిస్ ఉపజాతుల సంతతి. ఇది నేడు జీవించి ఉన్న అతిపెద్ద అడవి పులులలో ఒక రకం. ఇది ప్రపంచంలోని ఆకర్షణీయమైన మెగాఫౌనాకు చెందిన అరుదైన పులిగా దీనిని పరిగణిస్తున్నారు. భారత ఉపఖండంలో ప్లీస్టోసీన్ చివరి కాలం నుండి దాదాపు 12,000 నుండి 16,500 సంవత్సరాల వరకు ఈ పులి ఉన్నట్లు అంచనా. నేడు దీనిని వేటాడటం, వీటికి నష్టం కలిగించడం, వాటి ఆవాసాలు ఛిన్నాభిన్నం కావడం కారణంగా వీటికి ముప్పు పొంచి ఉంది. ఇవి 2011 నాటికి 2,500 కంటే తక్కువగా ఉంటాయని ఓ అంచనా వేయబడింది. వీటికి టైగర్ కన్జర్వేషన్ ల్యాండ్‌స్కేప్‌లు 250 కంటే ఎక్కువ లేవని అంటున్నారు.
బెంగాల్ పులి యొక్క చారిత్రక శ్రేణి 19 వ శతాబ్దం ప్రారంభం వరకు పాకిస్తాన్ లోని సింధు నదీ పరీవాహక లోయ ప్రాంతంలోనూ, దాదాపు భారతదేశం, దక్షిణ నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, దక్షిణ టిబెట్ లోనూ ఈ ఇవి నాడు ఉండేవి. అయితే నేడు ఇవి భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దక్షిణ టిబెట్లలో మాత్రమే నివసిస్తున్నాయి. భారతదేశంలో ఈ పులులు సంఖ్య 2018 నాటికి 2,603 నుండి 3,346 వరకూ,
బంగ్లాదేశ్‌లో 300 నుండి 500 వరకూ, నేపాల్‌లో 220 నుండి 274 వరకూ, అదే 2015 లో భూటాన్‌లో 90 వరకూ ఈ రాయల్ బెంగాల్ టైగర్లు ఉన్నట్లు అంచనా.