విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:
ఎటపాక , విశ్వం వాయిస్ న్యూస్ :
మండలపరిధిలోని రామగోపాలపురం గ్రామంలో పోలవరం నిర్వాసితుల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లను శుక్రవారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి కణితి మధు పరిశీలించారు. ఈ సందర్భంగా కణితి మధు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసం ఇంటిని ,భూమిని ఇచ్చి వేరే గ్రామానికి తరలి వెళ్లడం అనేది ఎంతో త్యాగంతో కూడుకున్న పనియని, పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్వాసితుల త్యాగమని ,పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని తెలియజేశారు. పోలవరం నిర్వాసితుల కాలనీలలో నిర్మిస్తున్న గృహాలను ఆయన పరిశీలించి గృహాల నాణ్యత గురించి ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 289 నిర్వాసిత ఇళ్లను పరిశీలించారు. పోలవరం నిర్వాసితులకు అర్ అండ్ అర్ మెరుగైన ప్యాకేజీ అందించాలని , 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజీ ఇవ్వాలని , ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని భూమికి భూమి ఇవ్వాలని , ఆదాయ మార్గాలు చూపించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాయం భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.