విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్
కాకినాడ జిల్లాలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ వ్యవస్థల ద్వారా పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు, భారీ వర్షాల సమయంలో ముంపు సమస్య పరిష్కారానికి అవసరమైన పనులను గుర్తించి ప్రాధాన్యక్రమంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ కృతికా శుక్లా జిల్లాలో సాగునీటి వ్యవస్థలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌కు డెల్టా కాలువల ద్వారా నీటి విడుదలైన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి; ఏలేరు నీటిపారుదల, డ్రెయిన్ల వ్యవస్థ తొలి, రెండో దశ ఆధునికీకరణ పనులు, సమస్యల గుర్తింపు-పరిష్కారానికి తక్షణ కార్యాచరణపై అధికారులతో చర్చించారు. 24.11 టీఎంసీల సామర్థ్యం గల ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు పరిధిలో ఇరిగేషన్ వ్యవస్థ ఆధునికీకరణకు సంబంధించి రూ.116 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు 60 శాతం పూర్తయినట్లు చెబుతూ కాలువల విస్తరణ, సాగునీటి నిర్మాణాల పనులను అధికారులు వివరించారు. ఏలేరుతో పాటు సుబ్బారెడ్డి సాగర్ ప్రాజెక్టు, పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ) తదితరాల పరిధిలో ఆయకట్టుపైనా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగునీటి కాలువలు, డ్రెయిన్లకు సంబంధించి అవసరమైన పనులు గుర్తించి, అంచనాలతో సవివర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఏలేరు ఇరిగేషన్ డివిజన్, పెద్దాపురం పరిధిలో రూ. 2.35 కోట్ల విలువైన ఆరు పనులను జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్) కింద చేపట్టేందుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇదే విధంగా మరికొన్నిపనులను గుర్తించి, ప్రతిపాదించాలన్నారు. ప్రాధాన్య క్రమంలో పనుల పూర్తికి అధికారులు ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీటి వ్యవస్థలో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా ముఖ్యమైనవని కలెక్టర్ పేర్కొన్నారు.సమావేశంలో ఇరిగేషన్ ఈఈలు డీవీ రామగోపాల్,నరసింహరాజు, డీఈలు ప్రశాంత్ బాబు, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.