విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ : విశ్వం వాయిస్ న్యూస్
వైసిపి ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడేళ్ల కాలంలో కాకినాడ అభివృద్ధికి ఎమ్మెల్యే ద్వారంపూడి చేసింది శూన్యమని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు విమర్శించారు. శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి మెయిన్ రోడ్డు వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం నందు డప్పులు వాయించి నినాదాలతో కొండబాబు వినూత్న నిరసన తెలియజేశారు.
ఈ సందర్బంగా కొండబాబు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల కాలంలో కాకినాడ నగరం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాకినాడ కార్పొరేషన్ ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి అభివృద్ధి చేపట్టగా నేడు వైకాపా మూడేళ్ల పాలనలో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉందని, ప్రచార ఆర్భాటాలు పత్రికా ప్రకటనలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఒక్క రూపాయి నిధులు కూడా తీసుకురాలేదని కాకినాడ కార్పోరేషన్ నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేస్తూ కాకినాడ నగర ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ నగరానికి ద్వారంపూడి తీసుకొచ్చిదేంటంటే మద్యం దుకాణాలు, గంజాయి, గుట్కా, హెరాయిన్, సరఫరాను తీసుకువచ్చారని అన్నారు. వ్యాపార సముదాయాలు మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల మహిళలు వ్యాపార వర్గాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నా ఎమ్మెల్యే పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. కల్తీ మద్యం, హెరాయిన్, గంజాయి, గుట్కా సరఫరాతో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారన్నారు.గడప గడపకు కార్యక్రమంలో సమస్యలపై ప్రజలు నిలదీస్తుంటే ఎమ్మెల్యే ప్రజలను కూడా బెదిరిస్తూ బూతులు తిడుతున్నారన్నారు. గడపగడపకు కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది చేత వెట్టిచాకిరీలు చేయిస్తున్నారని, ప్రజలకే కాదు మీడియా సోదరులకు ప్రతిపక్షాలకు కూడా ఎమ్మెల్యే భయపడుతున్నారని అందుకే కార్పొరేషన్ సమావేశాల్లో డిఆర్సీ సమావేశాల్లోకి మీడియాకు అనుమతి లేదని బయటకు పంపించేమని అధికారులను ఆదేశిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే బూతులతో వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ పత్రిక సోదరులను కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని, కాకినాడ నగరానికి అభివృద్ధి చేపట్టకుండా మాదకద్రవ్యాలు మద్యం దుకాణాలు తీసుకొచ్చిన ఘనత ద్వారంపూడికే దక్కుతుందన్నారు. కాకినాడ నగర ప్రజలు ద్వారంపూడిని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని కొండబాబు విమర్శించారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, వొమ్మి బాలాజి, బచ్చు శేఖర్, అమన్ జైన్, చింతలపూడి రవికుమార్, సంఘాని గాంధీ, సీకోటి శ్రీనివాస్, బచ్చా దాసు, పొ౦గా బుజ్జి, సీకోటి అప్పలకొండ, బంగారు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.