విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్)
అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ లోక్ సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళా పైలట్ల సంఖ్యను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, ఇస్తున్న ప్రోత్సాహకాల వివరాలు మరియు ఒకవేళ చేయని పక్షంలో అందుకు గల కారణాలను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి వర్యులు తెలపాలని కోరారు. అందుకు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా సమాధానమిస్తూ అంతర్జాతీయ మహిళా పైలట్ల సొసైటీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మహిళా పైలట్ల సగటు కేవలం 5% ఉండగా, భారతదేశంలో మాత్రం 15% ఉందని తెలిపారు.
అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మరియు అనుబంధ సంస్థల సహకారంతో మహిళలు మరియు పురుషుల పైలట్ల సంఖ్యను పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు, అందులో భాగంగా ఇటీవల 5 విమానాశ్రయాల్లో (బెలగావి, జలగాన్, కాలాబుర్గి, ఖజురహో, లీలాబరి) 5 ఫ్లయింగ్ శిక్షణ సంస్థల ఏర్పాటుకు అనుమతినిచ్చామని, తదుపరి ఫేస్ లో మరో 5 విమానాశ్రయాల్లో (భావనగర్, హబ్బలి, కడప, కిషన్ గడ్, సేలం) 6 ఫ్లయింగ్ శిక్షణ కేంద్రాలకు అనుమతి ఇవ్వనున్నామని, తద్వారా దేశంలో కమర్షియల్ పైలట్ల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కృషి చేయడమే కాకుండా, ఉమెన్ ఇన్ ఏవియేషన్ ఇంటర్నేషనల్ – ఇండియా విభాగం సహకారంతో మరియు నిపుణులైన పైలట్లతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ దేశంలోని యువతులను మరియు తక్కువ ఆదాయ కుటుంబాలని దృష్టిలో ఉంచుకుని అనేక చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఆ దిశగా చైతన్యాన్ని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ చింతా అనూరాధ కి కేంద్ర మంత్రి తెలియజేయడం జరిగింది.