విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటి:
జ్యోతిరావు పూలే, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధాన్నాన్ని అవగతం చేసుకుంటూ అణగారిన వర్గాల మధ్య ఐక్యత సాధించాలని పలువురు వక్తలు సూచించారు. సెంటర్ ఫర్ డెమొక్రసీ పబ్లికేషన్స్ అధినేత కనికర్ల వెస్లీ సారధ్యంలో ‘దళిత సాంస్కృతిక ఉద్యమ పండుగ’లో భాగంగా ‘150 ఏళ్ల ఉద్యమ పండుగ’, ‘దళితులు యుద్ధవీరులు’ , భక్తి ఉద్యమం’ అనే మూడు పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ కాటన్ కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం సాయంత్రం సందడిగా జరిగింది. ఈదేశంలో అన్ని ఉద్యమాల్లో దళితుల భాగస్వామ్యం ఉందన్న వాస్తవాన్ని తెలియజేస్తూ ఈ మూడు పుస్తకాలూ తీసుకు రావడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు.వెస్లీతో పాటు ఆయన కుమార్తె కుమారి మేఘన కల్సి రచించిన ఈ మూడు పుస్తకాలను ప్రతి ఒక్కరూ చదివి, దాచబడ్డ మన చరిత్రను తెలుసుకోవాలని వక్తలు సూచించారు. కె తిలక్ కుమార్, రాజేంద్ర, గుబ్బల రాంబాబు,నయనాల కృష్ణారావు సమీక్ష చేస్తూ, ఈ పుస్తకాల ద్వారా ఒక మంచి ప్రయత్నం చేకూరుతుందని, మన చరిత్ర మనం తెలుసుకోవడంతో పాటు, వర్తమాన భవిష్యత్ తరాలకు తెలియజేయడానికి ఈ పుస్తకాలు దోహదం చేస్తాయన్నారు. డాక్టర్ అనసూరి పద్మలత, ప్రొఫెసర్ కూర్మయ్య, బర్రే కొండబాబు, నక్కపల్లి శామ్యూల్ తదితరులు ప్రసంగించారు. సెంటర్ ఫర్ డెమొక్రసీ పబ్లికేషన్స్ పక్షాన ఏడాదిపాటు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ మూడు పుస్తకాలను తీసుకొచ్చామని వెస్లీ చెప్పారు.డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ ఓ డాక్టర్ కోమలి, కోడి ప్రవీణ్ ,దాసి వెంకట్రావు, కేకే సంజీవరావు, కొండేటి భీమారావు, డాక్టర్ ప్రసాదరావు, కోరుకొండ చిరంజీవి, వైరాల అప్పారావు, సానబోయిన రామారావు, తాళ్ళూరి బాబూ రాజేంద్ర ప్రసాద్, పిల్లి నిర్మల, ఆరే చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఈసందర్బంగా కుమారి మేఘనను పలువురు అభినందించి, సత్కరించారు.