విశ్వంవాయిస్ న్యూస్, మోతుగూడెం:
ప్రకృతి ఒడిలో ఫోర్ బే గ్రామం …ఈ గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్న నాలుగు గ్రామాలు👉🏻 యం. సి. డి క్యాంప్,ఇంతులూరివాగు, ఒడియా క్యాంప్ పరిసరాలన్నీ దట్టమైన పచ్చని చెట్లు ,సింహగర్జనలా నీటితో శబ్దం చేసే ఫోర్ బే కెనాల్ బ్రిడ్జ్, భిన్న జీవజాతులకు సహజావాసంగా ఉండటం, సృష్టి, స్థితి, లయలతో శ్రావ్యంగా ఉండటం,వర్ణనాతీతం ఇది
ఒక్క ఫోర్ బే అరణ్యానికే సాధ్యం. అందుకే అడవంటే ఈ ప్రాంత ప్రజలకు ఆరాధన❗️ పుట్టినప్పటి నుండి నగరాల్లోనే బ్రతికిన వారు, కనీసం గ్రామీణ జీవితం కూడా పెద్దగా అనుభవం లేని వారు, ఎక్కడ పెద్ద చెట్టు కనబడ్డా ఒక హీరోని చూసినట్టు చూస్తారు. అటువంటిది వేలాది మహావృక్షాలు, లక్షలాది మొక్కలతో వాగులు, జలపాతాలు, నదులు వంటి ప్రాకృతిక జలాశయాలు.అనంతానంత జీవ వైవిధ్యంతో మనిషి ఇప్పటికీ నాశనం చేయకుండా లేదా చేయలేక వదిలేసినా ,ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోని కుగ్రామం ఈ ఫోర్ బే..గ్రామం. ఎందరో పర్యాటకులు కార్లేసుకొని వచ్చి రహదార్ల ప్రక్కన పచ్చని చెట్లను, కొండలపైనుంచి జారి పడే.. పాల నురగల్లాంటి జలపాతాలను ఆశ్వాదించి వెళతారు. ఆ ఆవరణలోని పచ్చని చెట్ల మధ్య ఒక ఎండిపోయిన చెట్టు కూడా ఉంది. మిగతా పచ్చని చెట్లన్నీ కలిసి ఆ చెట్టుకి రక్షణనిస్తున్నట్టుగా నిండైన నీటి మధ్యలో ఎండిన చెట్టు కనులవిందు చేస్తుంది. ఫోర్ బే నుంచి ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు, కాలిబాటన వెళ్లే బాటసారులకు దూరం అనేది అసలు సమస్య కాదేమో. దూరాలు, భారాలు మనలాగా మోటారు బళ్ళకి అలవాటు పడ్డ వాళ్ళకే కానీ తమ జీవనంలో రాయీ, రప్పా, డొంకా,వంక, చెట్టూ, చేమల్ని భాగం చేసుకున్న గిరిపుత్రులకు కాదేమో ❔️ దారిలో ప్రకృతి అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నది. కాలుష్యానికి దూరంగా నీరు, గాలి, చెట్టూ, రాయి… అన్నీ ఒక్కో చోట ఒక్కో రకంగా ఓ గొప్ప సౌందర్యంతో తళుక్కుమంటాయి . అడవిలోని నిశ్శబ్దంలో కూడా ఒక అద్భుతమైన శ్రావ్యత ఉంటుంది అలసటగా అనిపిస్తున్నప్పటికీ ఓ తాదాత్మ్యంతో ముందుకెళతారు . ఒక్కోసారి మనిషంత ఎత్తు రాళ్ళని దాటితే కొండ లోయలలో ఉండే వరి, పసుపు పంటలు కనిపిస్తాయి . అదో మనోహర దృశ్యం.పచ్చటి పొలాలు, ఆ అమాయక గిరిజనులకు తమ పనులు తాము చేసుకోవడం తప్ప, వచ్చిన వాళ్ళను ఎగాదిగా చూడటం కానీ, ఏవో ప్రశ్నలు వేయటం కానీ చేయరు . నాగరిక సమాజం నుండి భౌతికంగా అంతెత్తు కొండల మధ్య జీవిస్తున్న వారి ప్రవర్తనకు ముచ్చటేస్తుంది . ఈ గిరిపుత్రులు నాగరిక సమాజానికి దూరంగా వున్నారే కానీ నాగరికతకు కాదు. వ్యవసాయం మీద ఆధారపడతారు వీళ్ళు పశుపోషణ కూడా చేస్తారు. ఆవులున్నాయి. కానీ పాలు తీయరు. ఎందుకు తీయరంటే పాలు దూడ కోసం వదిలేస్తారు. మరి ఆవులెందుకు పెంచటమంటే వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులకు జత కోసం. . వేటకి వెళుతుంటారు. చిన్న చిన్న జంతువులని కొట్టుకొస్తుంటారు. జీలుగు కల్లు తాగుతారు. ఆ ప్రాంతాన్ని చూసినవారికి ఏదో పురాతన పరిచయం వున్నట్లు అనిపిస్తుంది.వేటకి వెళుతున్న గిరిజనుల దగ్గర బాణం విల్లంబుని తాకగానే వేటగాడిలా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఫోర్ బే గ్రామంలో ఎన్కౌంటర్, పుష్ప లాంటి చిత్రాలతో పాటు, చాలా సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ చిత్రీకరణ కూడా జరిగింది. ఇంకా ఎన్నో వింతలు, విశేషాలకు నిలయమైన ఫోర్ బే గ్రామం అభివృద్ధి కి మాత్రం వెనుకపడే వుంది…🌱