విశ్వంవాయిస్ న్యూస్, మోతుగూడెం:
మోతుగూడెం విశ్వం వాయిస్ :వైద్య సిబ్బంది సూచించినప్పటికీ తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా వైద్య సేవలు అందక 10 సంవత్సరముల చిన్నారి మృతిచెందిన ఘటన చింతూరు మండలం, మోతుగూడెం మేజర్ గ్రామ పంచాయతీ,ఫోర్ బే గ్రామానికి 5 కిలోమీటర్ల దూరాన ఉన్న రాజు క్యాంప్ గ్రామంలో జరిగింది.స్థానికుల కధనం ప్రకారం ఫోర్ బే గ్రామంలో గోలోరి అనిత అనే ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని..గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతుంటే, వైద్య సిబ్బంది చెప్పినా వినకుండా విద్యార్థిని తల్లిదండ్రులు దగ్గర లో ఉన్న గొడ్లగూడెం, చింతూరు ప్రభుత్వ వైద్యశాలలకు తీసుకుని వెళ్లకుండా, సుమారు 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చిత్రకొండ గ్రామంలోని ఒక ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడి సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యం బాగుందని చెప్పడంతో, ఆదివారం నాడు స్వగ్రామానికి తీసుకొని వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో బాలిక మృతి చెందిందని, తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలిక మృతి చెందిన వార్త విని వారి బంధువులు,చుట్టుప్రక్కల తడికవాగు, ఫోర్ బే, ఇంతులూరి వాగు, ఒడియా క్యాంప్, యం. సి. డి క్యాంప్ గ్రామాల ప్రజలు వచ్చి శోకసంద్రంలో మునిగారు…