విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, నారాయణపేట:
తెలంగాణ ఉద్యమకారుడు గరిడేపల్లి మండలం నాయినిగూడెం గ్రామానికి చెందిన నాగరాజుకు సోమవారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆర్థిక సాయం చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో రూ. 4లక్షలను అందించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను అర్పించేందుకు రైలుకు ఎదురెళ్లి రెండు కాళ్లు, చేయి పోగొట్టుకొని ఏ పనీ చేయలేక దుర్భరజీవితం గడుపుతున్న నాగరాజు ఈ నెల 12న హైదరాబాద్లోని ప్రగతి భవన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు.
ఈ నేపథ్యంలో అతని కన్నీటి వ్యథను “ఉపాధి కరువై.. బతుకుభారమై’ అనే శీర్షికన ఈ నెల 13న సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు వైఎస్ షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఆమె నాగరాజుతో ఫోన్లో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. అతడిని నారాయణపేటకు పిలిపించుకుని సోమవారం స్వాతంత్య్రవేడుకల్లో రూ.4లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ షర్మిల స్వయంగా ఫోన్ చేసి తనను నారాయణపేటకు పిలిపించుకొని ఆర్థిక సాయం చేశారన్నారు. దీంతో ఆమెకు ఎంతో రుణపడి ఉన్నానన్నారు. తన లాంటి తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారని, వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలని కోరారు.