Draksharama (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలి
- గ్రంథాలయాలు ఆధునిక విద్యాలయాలని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పేరిచర్ల శేఖర్ అన్నారు. ద్రాక్షారామ శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకోవడంతో పాటు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పుస్తకాలు విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు మార్గదర్శకంగా నిలుస్తాయని వివరించారు. అనంతరం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంగ్లీష్ అధ్యాపకుడు బి. శివరావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కె. జనార్ధనస్వామి, గ్రంథాలయ పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ద్రాక్షారామ శాఖా గ్రంథాలయాధికారి ఎం.వి. సూరిబాబు వందన సమర్పణ చేశారు.

