RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
జి.ఆర్.సి. మోడరన్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో శనివారం విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడకు చెందిన జేఎన్టీయూ మాజీ వైస్ ఛాన్సలర్, ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ కె.వి.ఎస్.జి. మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు విలువైన సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన చారిత్రక, వైజ్ఞానిక, భౌగోళిక అంశాలను ఆసక్తికరంగా వివరిస్తూ విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించారు. గణితంలో పలు మెలకువలను బోధించి, పట్టుదలతో కృషి చేస్తే అసాధ్యమైన లక్ష్యాలను సైతం సాధించవచ్చని ప్రేరణ కల్పించారు. మాతృభాష మూలాలను మరువకుండా ఇతర భాషల్లోనూ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించవచ్చని తెలిపారు. వ్యక్తిగత విజయాలకే పరిమితం కాకుండా సమాజ శ్రేయస్సును కూడా ఆకాంక్షించాలని, పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ అభివృద్ధిలో నేటి యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రొఫెసర్ డాక్టర్ కె.వి.ఎస్.జి. మురళీకృష్ణను మోడరన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లయన్ జి.వి. రావు, ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపాల్ సి.హెచ్. రాజేష్ మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఈ సందర్భంగా జి.వి. రావు మాట్లాడుతూ ప్రొఫెసర్ మురళీకృష్ణ నేటి యువతకు గొప్ప మార్గదర్శకత్వం అందిస్తున్నారని కొనియాడారు. విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేలా ఆయన చేస్తున్న రచనలు ఎంతో స్ఫూర్తిదాయకమని అభినందించారు.

